Outer Ring Road Land Acquisition: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అవతల నుంచి సుమారుగా 156 కిలోమీటర్ల మేర ప్రాంతీయరింగ్ రోడ్డు ఉత్తరభాగాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం భువనగిరి ఆర్డీవో పరిధిలో సుమారు 493 ఎకరాలు రైతులు భూముల్ని కోల్పోనున్నారు. రాయగిరి గ్రామంలోనే 266 ఎకరాలు సేకరించాల్సి ఉంది. రాయగిరిలో ఇప్పటికే హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి కోసం 58 ఎకరాలు తీసుకున్నారు. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట రహదారి విస్తరణ కోసం 13 ఎకరాల సేకరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపురం ప్రాజెక్టు ప్రధాన కాలువల కోసం 115 ఎకరాలు తీసుకున్నారు. తాజాగా ప్రాంతీయ రింగురోడ్డు కోసం రాయగిరి గ్రామంలో 266 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు భూములు కోల్పోయామని.. మరోసారి ప్రభుత్వం తమ భూమిని తీసుకుంటామంటే బతికేది ఎట్లా అని రైతులు ఆవేదన చెందుతున్నారు.
సర్వేలో ఆ మూడు గ్రామాల ఊసేది: ఈ ఏడాది మార్చి 30న విడుదల చేసిన ప్రాంతీయ రింగురోడ్డు షెడ్యూల్‌లో భువనగిరి ఆర్డీవో పరిధిలో రాయగిరి, భువనగిరి కేసారం, పెంచికల్ పహాడ్, తుక్కాపూర్ , చందుపట్ల , గౌస్ నగర్, యర్రంబెల్లి, నందనం గ్రామాల మీదుగా ప్రాంతీయ రింగు రోడ్డు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 24న జారీ చేసిన భూసేకరణ చేయాల్సిన సర్వే నెంబర్లు జాబితాలో భువనగిరి, చందుపట్ల, నందన గ్రామాల ఊసే లేదు. ఈ మూడు గ్రామాలను తొలగించడం వెనుక పెద్దల భూములు ఉండటమే కారణం అన్నది రైతుల ఆరోపణ.