yadadri brahmotsavam 2022 : యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా ప్రకారం ఇవాళ ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 14 వరకు కొనసాగనున్నాయి. స్వస్తివాచనంతో అర్చకులు ఉత్సవాలను ప్రారంభించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ పర్వాలలో హోమ, జపాదుల కోసం రుత్వికులు, పారాయణీకులను రప్పించారు.
విద్యుత్ కాంతుల్లో యాదాద్రీశుడు ఆదిపూజ..
విద్యుద్దీపాల వెలుగులో యాదాద్రీశుడు Yadadri brahmotsavalu : పాంచరాత్ర ఆగమంగా బ్రహ్మ నేతృత్వంలో ఉదయం మహావిష్ణువు సర్వసేనాని విష్వక్సేనుడిని కొలుస్తూ తొలిపూజ నిర్వహించారు. అగ్ని దేవుడిని ఆరాధించి పూజించిన జలంతో స్వస్తివచనం (శుద్ధి) చేపట్టారు. సాయంత్రం అంకురార్పణ పర్వం జరుగుతుంది. స్వయంభువులైన పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన బాలాలయంలో ఆరోసారి ఉత్సవాలు జరిపేందుకు ఆలయాన్ని ముస్తాబు చేశారు. కొవిడ్-19 నిబంధనలను అనుసరించి వేడుకలను బాలాలయం లోపలే నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నుంచి భక్తుల మొక్కు పూజలైన నిత్యకల్యాణం, శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహణను రద్దు చేశారు. ఈ నెల 14 వరకు ఈ విధానం కొనసాగుతుందని ఈవో గీత చెప్పారు.
11 రోజుల పాటు జరగనున్న పూజా విధానాలు..
- ఇవాళ ఉదయం విశ్వక్సేన పూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- రాత్రికి సంప్రదాయం ప్రకారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
- ఈనెల 5న ఉదయం అగ్నిప్రతిష్ట, ధ్వజావరోహణం
- ఈనెల 5న రాత్రి భేరీ పూజ, దేవతాహ్వానం
- ఈనెల 6న ఉ. మత్స్యావతారం, రాత్రి శేషవాహన సేవోత్సవం
- ఈనెల 7న ఉ. వటపత్రశాయి అలంకరణ, రాత్రి హంసవాహన సేవ
- ఈనెల 8న ఉదయం శ్రీకృష్ణాలంకరణ, రాత్రి పొన్నవాహన సేవ
- ఈనెల 9న ఉ. గోవర్ధనగిరి అలంకారోత్సవం, రాత్రి సింహవాహన సేవ
- యాదాద్రి: ఈనెల 10న విశేష ఉత్సవాలకు శ్రీకారం
- ఈనెల 10న ఉ. జగన్మోహిని అలంకరణ, రాత్రి అశ్వవాహన సేవ
- ఈనెల 11న ఉ. హనుమంతుని సేవోత్సవం, బాలాలయంలో తిరుకల్యాణం
- ఈనెల 12న ఉ. గరుడ వాహన సేవ, రాత్రి బాలాలయంలో దివ్యవిమాన రథోత్సవం
- ఈనెల 13న మహాపూర్ణాహుతి, చక్రతీర్ధం, రాత్రి పుష్ప యాగం, దేవతోద్వాసన
- ఈనెల14న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకంతో ఉత్సవాలకు ముగింపు
- బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యకల్యాణం నిర్వహణ నిలిపివేత
- బ్రహ్మోత్సవాల సందర్భంగా సుదర్శన నారసింహ హోమం నిలిపివేత
విద్యుద్దీప కాంతుల ధగధగ..
విద్యుత్ కాంతుల్లో మెరుస్తున్న రహదారులు yadadri brahmotsavalu 2022 : యాదాద్రి క్షేత్ర అభివృద్ధిలో భాగంగా రాయగిరి నుంచి యాదాద్రి పట్టణం వరకు రోడ్డు మధ్యలో విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేపట్టారు. యాదాద్రికి వెళ్లే మార్గంలో విశాల రహదారి మధ్యన విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ప్రత్యేక లైట్ల బిగింపు చేపట్టారు. అందులో భాగంగా రాయగిరి కమాన్ నుంచి వడాయి గూడెం సమీపంలోని అష్టలక్ష్మి ఆలయం రహదారి వరకు విద్యుత్ దీపాలను రాత్రి వేళలో కాంతులు విరజిమ్మేలా తీర్చిదిద్దారు. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాయగిరి చెరువు పరిసరాలలోని విశాలదారుల మధ్య విద్యుత్తు కాంతులు విరజిమ్మేలా ప్రత్యేకంగా ఎల్ఎస్ఈడీ దీపాలను ఏర్పాటు చేశారు. రాత్రివేళల్లో యాత్రికుల రాకపోకలకు ఎలాంటి అవరోధం కలగకుండా విభాగులపై ఏర్పాటు చేసిన స్తంభాలకు వాటిని బిగించారు. దీంతో పచ్చని పచ్చిక, చెట్ల నడుమ రహదారి మొత్తం కాంతులీనుతోంది.