అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసి ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్కు బహుమానంగా పంపించిన చరిత్ర మన నేతన్నల(weavers problems)ది. ఎన్నో రంగురంగుల డిజైన్లతో చీరను నేసిన నేతన్న, తమ బతుకులకు మాత్రం రంగులద్దలేక పోతున్నాడు. ఆర్థిక అసంతృప్తి వెనక్కు లాగుతున్నా.. పని ఇచ్చే సంతృప్తి ముందు ఏదీ సాటిరాదంటూ సాగిపోతున్నాడు. కానీ.. అతడి మీద ఆధారపడిన కుటుంబం మాత్రం అనేక ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటోంది. వస్త్ర ప్రపంచంలో ఎంత పురోగతి ఉన్నా.. ఎన్ని బహుళజాతి సంస్థలు వచ్చినా.. నేతన్న అన్నింటిని అధిగమించి.. తానేంటో నిరూపించుకుంటున్నాడు. కానీ.. ఆర్థికంగా మాత్రం ఎంతో కుంగిపోతున్నాడు. వస్త్ర రంగంలో.. తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకున్న చేనేత కార్మికులకు చేయందించి అక్కున చేర్చుకునే చేతుల కోసం ఎదురుచూస్తున్నారు.
భువనగిరిలో అత్యధిక చేనేత కార్మికులు
తెలంగాణ వ్యాప్తంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే అత్యధికంగా చేనేత మగ్గాలు(weavers problems)న్నాయి. ముఖ్యంగా భూదాన్ పోచంపల్లి మండలంలో 1550 మగ్గాలున్నాయి. వలిగొండ, చౌటుప్పల్, రామన్నపేట, చండూరు, రాజపేట, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కొయ్యలగూడెం, సిరిపురం, కుంట్లగూడెం, ఎల్లంకి, బోగారం, గౌరాయిపల్లి, గట్టుప్పల్ గ్రామాల్లో కూడా చేనేతను నమ్ముకుని చాలా కుటుంబాలు ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,294 మగ్గాలకు శాశ్వత జియో ట్యాగింగ్, 536 మగ్గాలకు తాత్కాలిక జియో ట్యాగింగ్లు ఉన్నాయి. మొత్తం జిల్లాలో 17,830 మంది చేనేత.. దాని అనుబంధ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నూలు సబ్సిడీ 40 శాతం కింద 10,006 మంది చేనేత కార్మికులకు 4 కోట్ల 90 లక్షల రూపాయలు విడుదల చెసినట్లు అధికారులు చెబుతున్నారు. ముద్ర లోన్ యోజన కింద జిల్లాలో 228 మంది చేనేత కార్మికులకు కోటి 14 లక్షల రూపాయలు రుణాలు మంజూరు చేసినట్లు , రుణ మాఫీ కింద 2,420 మంది చేనేత కళాకారులకు లబ్ది చేకూరిందని వెల్లడించారు.
రూ.500 కూలీ కూడా వస్తలేదు..
మరోవైపు.. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు అందరికి అందటం లేదని చేనేత కార్మికులు(weavers problems) వాపోతున్నారు. ఎంత కష్టపడ్డా రోజు కూలీ ఐదు వందలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యా భర్తలిద్దరు పని చేసినా.. కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని అంటున్నారు. తమ పిల్లల్ని ఈ రంగంలోకి రాకుండా ఉపాధి కోసం మరో రంగంలోకి పంపుతున్నామని చెబుతున్నారు. చేనేత కార్మికులకు వడ్డీ లేని రుణాలు, బీమా సౌకర్యం, పనికి మద్దతు ధర కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
2014 నుంచి 30 మంది ఆత్మహత్యలు
జిల్లాలో 2014 నుంచి సుమారు 30 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని నేతన్నలు అంటుండగా.. జిల్లా అధికారులు మాత్రం 15 మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఒక్కో కుటుంబానికి లక్షన్నర చొప్పున పరిహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపామని తెలిపారు. సర్కార్ నుంచి ఇంకా జిల్లాకు సమాచారం రాలేదని వెల్లడించారు.
ఏళ్లు గడిచినా..
మరోవైపు.. చేనేత కార్మికులు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందలేదని వారి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఇంటి యజమాని మరణంతో.. తాము రోడ్డున పడుతున్నామని వాపోతున్నారు. పిల్లల చదువు మాన్పించి పనుల్లోకి పంపాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేస్తున్నారు.