హాజీపూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ స్పష్టం చేశారు. ఫోక్సో నుంచి కొంత డబ్బును వారికి అందించామని...మరికొద్ది రోజుల్లో మిగిలిన డబ్బులు వచ్చే విధంగా చూస్తామని పాలనాధికారి పేర్కొన్నారు.
సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి పాలనాధికారి అనితా రామచంద్రన్ హాజీపూర్ గ్రామ ప్రజలతో ముఖాముఖిలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి హాజీపూర్ ఘటన వివరాలు అడిగారని కలెక్టర్ తెలిపారు. ఘటన జరిగినప్పుడు ఎన్నికలు ఉన్నందున ఏమి చేయలేకపోయామని ఇప్పుడు కచ్చితంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారని ఆమె గ్రామస్థులకు వివరించారు. హాజీపూర్ బ్రిడ్జి నిర్మాణంపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని పాలనాధికారి హామీ ఇచ్చారు.