సప్త రాజగోపురాలతో కొలువుదీరనున్న పంచనారసింహ క్షేత్రం పునర్నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసుకుంటోంది. కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా ప్రధానాలయం పూర్తిగా కృష్ణ శిలతో తయారవుతోంది. సప్త రాజగోపురాలతోపాటు మాడ వీధులు, అష్టభుజి ప్రాకార మండపాల పనులు పూర్తయ్యాయి. గర్భాలయం ఎదుట పన్నెండు మంది ఆళ్వారులతో కూడిన మహా ముఖ మండపం, దివ్యవిమాన గోపురం ఇప్పటికే పూర్తైంది.
తిరుపతి నుంచి జయవిజయుల విగ్రహాల తరలింపు
గర్భాలయ ద్వారానికి 17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పుతో కూడిన రెండు తలుపులను బిగించారు. పద్మం, స్వామి వారి రూపాలతో కూడిన నగీషీలను తలుపులకు పొందుపరుస్తారు. వేంచేపు మండపం నిర్మాణ దశలో ఉండగా ఆలయం లోపల ఆంజనేయస్వామి, శ్రీలక్ష్మీనృసింహుడు, జయవిజయుల విగ్రహాలు చూపరులను ఆకట్టుకోనున్నాయి. 10 అడుగులతో కూడిన జయవిజయుల విగ్రహాలను తిరుపతి నుంచి, నాలుగు ఐరావతాలను మహాబలిపురం నుంచి యాదాద్రికి తరలించారు.
కలశాల తయారీకి 3800 కిలోల రాగి, ఇత్తడి లోహాలు
నిర్మాణంలో సిమెంట్, ఇటుకకు భిన్నంగా సున్నం, బెల్లం, కరక్కాయ మిశ్రమాలను విస్తరణ పనులకు వాడారు. గర్భాలయ ప్రవేశ ద్వారంపై దక్షిణ దిశలో భక్తులను తన్మయత్వానికి గురిచేసేలా శంకు చక్ర నామాలు, ప్రహ్లాద చరిత్రను తెలిపేలా వెండి ఫలకాలను రూపొందించే పనులు చేపట్టారు. గర్భాలయంలో మహా ముఖ మండపం ఎదుట ధ్వజ స్తంభం, బలి పీఠం స్థాపన జరగాల్సి ఉంది. మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన కలశాలను ఇటీవలే పరిశీలించి రాగి తొడుగులు తొడిగారు. బంగారు పూత వేసేందుకు చెన్నై తరలించారు. కలశాల తయారీకి మూడు వేల ఎనిమిది వందల కిలోల రాగి, ఇత్తడి లోహాలను వాడుతున్నారు. తొలి ప్రాకారంలో లోపలి వైపు సింహం రూపాలతో కూడిన యాలి విగ్రహాల నిర్మాణాలు చేపట్టారు. రెండో ప్రాకారం వెలుపలి వైపు ద్వారపాలకులు, సాలహారాలు నిర్మిస్తున్నారు.