యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రానికి చెందిన ఏశాల శారద చిన్నప్పటి నుంచే... ఏదైనా నేర్చుకోవాలనే తపనతో ఉండేవారు. పదవ తరగతితో పాటు టైలరింగ్ కూడా చేశారు. కొన్నాళ్లు మిషన్ కుట్టు పని చేశారు. ఆమె భర్త ఏశాల కృష్ణ 20 ఏళ్ళుగా మండలకేంద్రంలో "మమత" డిజిటల్ ఫోటో స్టూడియో నిర్వర్తిస్తున్నారు. కృష్ణ వృత్తిలో భాగంగా ఇతర ప్రాంతాలకు బయటకు వెళ్ళినప్పుడు, ఫోటో స్టూడియో తరచూ బంద్ చేసేవారు.
ఆలోచనను ఆచరణలో పెట్టి..
అప్పుడే శారదకు ఒక ఆలోచన తట్టింది. తను కూడా ఈ ఫోటోగ్రఫీని నేర్చుకుని... భర్త లేని సందర్భాలలో స్టూడియో బాధ్యతను చూసుకోవచ్చు అనుకుంది. ఈ విషయాన్ని భర్తకు అర్థమయ్యేలా వివరించింది. అంగీకరించిన భర్త... ఫోటోగ్రఫీలో ఉన్న పద్ధతులు, మెలకువలు నేర్చుకొన్నారు. ఇప్పుడు ఆమె కూడా ఒక మంచి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌గా పై స్థాయికి చేరుకున్నారు. వాడకంలో ఉన్న పాస్ పోర్ట్ సైజు ఫోటోల దగ్గర నుంచి... ఆధునిక రంగంతో పోటీ పడుతున్న కెమెరాలతో సహా చక్కని ఫోటోలు తీస్తుంది. భర్తతో కలిసి బయట వివాహాది శుభకార్యాలకు, ఇతర ఫంక్షన్లకు హాజరవుతూ... ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. కంప్యూటర్ సహాయంతో ఆల్బమ్ డిజైన్లు, ఫోటోల గ్రాఫిక్స్‌ను చేస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు.