తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhuvanagiri Govt doctors negligence : సర్కారు దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం.. కుట్లు పెకిలి నరకయాతన

Bhuvanagiri Govt doctors negligence : భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. మెరుగైన వైద్యం అందిస్తారని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే... శస్త్రచికిత్స సరిగా చేయక ఇన్​ఫెక్షన్ సోకి నానా అవస్థలు పడుతున్నారు. ఇటీవల సర్జరీ చేయించుకున్న 8 మంది మహిళలకు కుట్లు పెకలడంతో.. నొప్పి భరించలేక కన్నీటిపర్యంతమవుతున్నారు.

Bhuvanagiri Govt doctors negligence, women problems with doctors negligence
సర్కారు దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం

By

Published : Dec 17, 2021, 4:18 PM IST

Updated : Dec 17, 2021, 5:04 PM IST

Bhuvanagiri Govt doctors negligence : ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం రోగులపాలిట శాపంగా మారింది. ప్రసవం కోసం వెళ్లి... ఇన్​ఫెక్షన్​తో బాధితులు మంచానికే పరిమితం అయ్యారు. ఇటీవల శస్త్రచికిత్స జరిగిన ఎనిమిదిమంది మహిళలకు ఇదే పరిస్థితి. ఆపరేషన్ చేసిన తర్వాత... కుట్లు విడిపోయి నానా అవస్థలు పడుతున్నారు. కొంతమందికి ఇన్‌ఫెక్షన్ సోకి.. ఆ నొప్పిని భరించలేక నరకయాతన అనుభవిస్తున్నారు. ఓవైపు నొప్పులు భరించలేక తల్లుల ఏడుపులు... మరోవైపు అమ్మకోసం పసివాళ్ల కేకలతో బాధిత కుటుంబసభ్యులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల దీనస్థితి ఇదీ.

ఏం జరిగింది?

జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యులు ఏడు రోజుల కిందట 8 మంది మహిళలకు శస్త్రచికిత్స చేశారు. మహిళలకు ఆపరేషన్ చేసిన చోట కుట్లు విడిపోయి... ఇన్​ఫెక్షన్ సోకిందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ నొప్పిని భరించలేక బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. వారందరికీ రోజూ డ్రెస్సింగ్ చేసినా... రోజు రోజుకూ కుట్లు విడిపోతున్నాయని, వైద్యులు సరిగా కుట్లు వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. 'ఇదేంటని అడిగితే.. మీరు చేయండి' అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్లక్ష్యంగా సమాధానం

దీనిపై బాధిత కుటుంబ సభ్యులు... వైద్యులను నిలదీయగా... కుట్లు విడిపోయిన చోట మరోమారు కుట్లు వేస్తామని వైద్యులు చెబుతున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది సూచించారని చెప్పారు. పేద కుటుంబాలకు చెందిన తాము మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే... పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కుట్లు విడిపోయి... అవస్థ పడుతున్నామని... ఇది గమనించి మెరుగైన వైద్యం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

'ప్రభుత్వ దవాఖానా అని వస్తే... సరిగా పట్టించుకుంటలేరు. పేరుకే ప్రభుత్వ ఆస్పత్రి కానీ... మందులు మేమే కొనుక్కోవాల్సి వస్తుంది. ఆస్పత్రి కింది స్థాయి సిబ్బంది ప్రతీ సేవకు ఓ రేటును నిర్ణయించారు. డబ్బులు ఇవ్వనిదే సేవలు అందించటం లేదు. మా వద్ద పైసలుంటే ఉంటే ప్రైవేటు ఆస్పత్రికే వెళ్లే వాళ్లం కదా.'

-బాధితులు

'ఏడో తారీఖున డెలవరీ అయింది. కుట్లు ఇప్పిన తర్వాత కొంచెం మానలేదు అన్నారు. ఇవాళ, రేపు అంటూ లేట్ చేస్తున్నారు. బయట నుంచి ఇంజెక్షన్లు తెస్తున్నాం. అయినా కూడా మానడం లేదు. రోజురోజుకూ కుట్లు పెకులుతున్నాయి. ఇట్ల అయితే మనుషులు బతుకుతరా?. మళ్లీ మళ్లీ కుట్లు వేస్తే మనుషులు ఉంటరా? డాక్టర్లను అడిగితే మీరు చేద్దురు రండి అంటున్నారు. మేం చేసేటోళ్లం అయితే మీరెందుకు మరి.. ఈడికి ఎందుకు వస్తాం. సూదులు, మందులు బయట నుంచే తెస్తున్నాం. ఏ పని చేసినా డబ్బులు తీసుకుంటున్నారు. ఏం చేసినా వందలకు వందలు అడుగుతున్నారు. మేం గరీబోళ్లం. ఈ ప్రభుత్వ దవాఖానాల రూ.15 వేలు అయ్యాయి. కుట్లుమానక మా పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ఎట్ల తక్కువవతుందో ఏమో..!'

-బాధితుల కుటుంబసభ్యులు

సర్కారు దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం

కలెక్టర్ స్పందన

ఈ ఘటనపై కలెక్టర్ పమేలా సత్పతి స్పందించారు. ఆస్పత్రిలో బాధిత మహిళలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్... బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు. ప్రసూతి వార్డులు పరిశుభ్రంగా ఉంచాలని... రోగి బెడ్ వద్ద ఒక్కరు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాంబశివరావు, జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నా నాయక్ ఉన్నారు.

ఇదీ చదవండి:Protest at intermediate board : ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత

Last Updated : Dec 17, 2021, 5:04 PM IST

ABOUT THE AUTHOR

...view details