Yadadri Temple News: యదాద్రీశుడి చెంత తలనీలాల మొక్కు తీర్చుకునే వారికి సకల సౌకర్యాలతో కల్యాణకట్ట నిర్మించారు. ఆలయ మహాకుంభ సంప్రోక్షణ రోజే దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు ‘అధికారులు చర్యలు చేపట్టారు.
కొండ కింద రెండున్నర ఎకరాల స్థలంలో రూ. 20.30 కోట్ల వ్యయంతో 54 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కల్యాణకట్ట సముదాయాన్ని నిర్మించారు. గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా విశాలంగా రూపొందించారు. ఇక్కడ ఒకేసారి 395 మంది తలనీలాలు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు.
పురుషులు, మహిళలకు వేర్వేరుగా ప్రవేశ మార్గాలు, వేచి ఉండే గదులు, సామగ్రి భద్రపరచుకునే కౌంటర్లను ఏర్పాటు చేశారు. పురుషుల విభాగంలో ఒకేసారి 265 మంది మొక్కు తీర్చుకునేందుకు వీలుగా వసతులు కల్పించారు. స్నానాలకు 18 గదులు, దుస్తుల మార్పిడికి 26 గదులు, 10 శౌచాలయాలు, 30 మూత్రశాలలు నిర్మించారు. మహిళల విభాగంలో ఒకేసారి 130 మంది తలనీలాలు సమర్పించుకునేలా సీటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్నానాల కోసం 20 గదులు, దుస్తుల మార్పిడికి 20 గదులు అందుబాటులో ఉన్నాయి. నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లు, నిఘా పర్యవేక్షణకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. నీటి కోసం లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన సంపు ఏర్పరిచారు. భక్తులు సమర్పించిన తల వెంట్రుకలను భద్రపరిచి, ఆరబెట్టే యంత్రాన్ని ఇక్కడ ఏర్పాటుచేస్తున్నారు.