యాదాద్రిని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రిలో పర్యటించిన మంత్రులు.. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భవ్యమందిరం పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులు, ఇంజినీర్లు, ఇతర సిబ్బందిని ఆత్మీయ సత్కారం చేశారు. యాదాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా... పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లే అద్భుత యాదాద్రి నిర్మాణం సాకారమైందన్నారు. పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న అధికారులు, ఇంజినీర్ల సేవలను మంత్రి కొనియాడారు.
యాదాద్రి పర్యటన తర్వాత తిరుగు పయనమైన మంత్రి జగదీశ్‌రెడ్డిని యాదగిరిగుట్టలో ఆటో కార్మికులు, స్థానికులు అడ్డుకున్నారు. కొండపైకి ఆటోలను అనుమతించకపోవడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులను పోలీసులు అడ్డుకోగా.. స్వల్ప తోపులాట జరిగింది. సమస్యను పరిష్కరిస్తానన్న మంత్రి జగదీశ్‌రెడ్డి హామీతో ఆటో కార్మికులు ఆందోళన విరమించారు