యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి - చిట్యాల మార్గంలో ఎదుల్లగూడెం రైల్వే స్టాప్ ఉంది. అక్కడి నుంచి ఒక కిలోమీటర్ వెళ్తే ఎదుల్లగూడెం గ్రామానికి చేరుకోవచ్చు. అందుకోసం.. గ్రామ సమీపంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జిని దాటాలి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైల్వే అండర్ బ్రిడ్జి కింద తరచూ నీరు చేరుతుంది. ఫలితంగా ఆ మార్గంలో ప్రజలు రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది.
4 చక్రాల వాహనాలకు ఇబ్బందే..
దాదాపు 18 ఫీట్లు ఎత్తు ఉన్న రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద దాదాపు 14 ఫీట్ల వరకు నీరు నిలిచింది. సమీప గ్రామాల ప్రజలు బ్రిడ్జి కింద వర్షపు నీరు నిలవడం వల్ల రైల్వే ట్రాక్ పైనుంచి, రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే ట్రాక్ దాటడానికి వాహనదారులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కార్లు, ట్రాక్టర్లు, లారీలు గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేదు. ఎవరైనా ఆరోగ్యం బాగాలేక వైద్యం చేయించుకోవాలంటే.. రైల్వే ట్రాక్ వరకు ఒక వాహనంలో వచ్చి అక్కడి నుంచి.. మరో వాహనాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందే.
సుమారు 4వేల మందికి సమస్య
భువనగిరి - చిట్యాల మార్గంలో ఎదుల్లగూడెం స్టాప్ నుంచి ఎదుల్లగూడెం, ఆవాస గ్రామం చైతన్యపురి, ప్రొద్దుటూరు, ఎద్దుల గూడెం గ్రామాలకు వెళ్లాల్సిన వారంతా రైల్వే అండర్ బ్రిడ్జి కింద నుంచి వెళ్లాల్సిందే. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రాక్ పైనుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ద్విచక్రవాహనాలు ట్రాక్ దాటాలంటే పట్టాల మీదుగా ఆపసోపాలు పడాల్సిందే. ఎదుల్లగూడెం, పొద్దుటూరు గ్రామాల్లో దాదాపు నాలుగైదు వేల జనాభా ఈ మార్గం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాలంటే అష్టకష్టాలు పడాల్సిందే.