Yadadri temple: యాదాద్రి పుణ్యక్షేత్రంలోని బాలాలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారదర్శనం కల్పించాలని దేవస్థానం నిర్ణయించింది. అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ ఉత్తర ద్వారదర్శనం కల్పిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీత గురువారం తెలిపారు. వైకుంఠ(ముక్కోటి) ఏకాదశి రోజు నుంచి ఆరు రోజులపాటు బాలాలయంలో వార్షిక అధ్యయనోత్సవాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా శ్రీసుదర్శన హోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణోత్సవాలను నిలిపివేయనున్నట్లు ఈవో వివరించారు.
నిరంతర విద్యుత్తు సరఫరాకు కసరత్తు...
ప్రసిద్ధ యాదాద్రి పుణ్యక్షేత్రంలో నిరంతరాయ విద్యుత్తు సరఫరాకు ప్రభుత్వ ఆదేశాలతో ఆ శాఖ అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు. గురువారం రోజు టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీజీఎం భిక్షపతి ఎస్‌ఈ శ్రీనాథ్ క్షేత్ర పరిధిలో పర్యటించి, ఏర్పాట్లపై పరిశీలించారు. విద్యుత్తు సబ్‌స్టేషన్లను పరిశీలించి రెండు మార్గాలతోపాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యాదాద్రికి విద్యుత్తు సరఫరా చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రధానంగా ప్రధానాలయానికి విద్యుత్తు సరఫరా అంతరాయం లేకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కొండ చుట్టూ, రహదారులు, దిగువ ఉన్న గండి చెరువు ప్రాంగణంలోని లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, బస్టాండ్, దీక్షపరుల మండపం, అన్నసత్ర భవనం, దుకాణ సముదాయాలు ఆయా ప్రాంతాలకు విద్యుత్తు అందించే చర్యలన్నింటీని జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులకు సూచించారు. వారి వెంట ఏడీ సూర్య, ఏఈ సాయిదీప్‌లు ఉన్నారు.