యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో నిత్య పూజలు ఆగమ శాస్త్ర ప్రకారం జరిగాయి. ఉదయం సుప్రభాత సేవతో అర్చకులు పూజలు ప్రారంభించారు. బాలాలయంలో ప్రతిష్టామూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. తులసీ పత్రాలతో అర్చన చేశారు. బాలాలయం మండపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేన ఆరాధనతో నిత్య కల్యాణాలు వైభవంగా కొనసాగాయి.
వైభవంగా ఊంజల్ సేవ
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, అమ్మవారికి ఊంజల్ సేవా పర్వాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. సాయంత్రం బాలాలయంలో ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఊంజల్ సేవ నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేశారు. వివిధ రకాల పూలతో, తులసీ దళాలతో పూజలు చేపట్టారు. ఆలయ అర్చకులు, అర్చక స్వాములు ఊంజల్ సేవలో కొలువై ఉన్న ఆండాళ్ అమ్మవారికి హారతినిస్తూ కీర్తన చేశారు.