తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో టెస్కో కుదేలు.. ఆదాయం లేక నేతన్నల ఇబ్బందులు - నష్టాల్లో టెస్కో

TSCO Handlooms : కరోనా ప్రభావంతో కుదేలైన రంగాలు కాస్త తేరుకున్నప్పటికీ.. తెలంగాణ చేనేత రంగానికి పెద్ద దిక్కయిన టెస్కో మాత్రం కొవిడ్ ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. గత రెండేళ్లు విద్యార్థులు ఇళ్లకే పరిమితమవ్వడం.. ఆన్‌లైన్ తరగతులు జరుగుతుండటం వల్ల సర్కార్ బడులు, గురుకులాలకు యూనిఫారమ్‌లు, దుప్పట్ల ఆర్డర్లు రావడం లేదు. మరోవైపు దుకాణాల్లోనూ వస్త్రాల అమ్మకాలు తగ్గడంతో టెస్కో ఆదాయం గణనీయంగా తగ్గింది.

TSCO Handlooms
TSCO Handlooms

By

Published : Apr 20, 2022, 7:35 AM IST

TSCO Handlooms : తెలంగాణ చేనేత రంగానికి పెద్ద దిక్కయిన రాష్ట్ర సహకార సంఘం (టెస్కో) కరోనా ప్రభావంతో కుదేలయింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలకు ఏకరూప దుస్తులు, దుప్పట్ల పంపిణీ కోసం రెండేళ్లుగా ఆర్డర్లు రావడం లేదు. మరోవైపు దుకాణ సముదాయాల్లో వస్త్రాల అమ్మకాలు తగ్గాయి. ఆదాయం గణనీయంగా తగ్గింది. గతంలో డిమాండు దృష్ట్యా సంఘాల్లో రెండు పూటలా కార్మికులకు పనులు ఉండేవి. ఇప్పుడు ఒక పూటే పని లభిస్తోంది.

గతంలో ఏటా రూ.90 కోట్ల ఆర్డర్లు
Corona Effect on TSCO Handlooms : టెస్కోలో 380 గ్రామస్థాయి ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. కార్మికులు చేనేత సహకార సంఘాల ద్వారా టెస్కోకు వస్త్రాలు సరఫరా చేస్తున్నారు. టెస్కో ఆ వస్త్రాల అమ్మకానికి తెలంగాణలోని 37 పట్టణాల్లో, ఉత్తర భారతదేశంలో 9 నగరాల్లో షోరూములను ఏర్పాటు చేసింది. అలాగే ప్రభుత్వ శాఖల ద్వారా ఆర్డర్లు పొంది వాటిని ఉత్పత్తి చేయించి పంపిణీ చేస్తుంది. ఏటా పాఠశాల విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యాలయ సంస్థల ద్వారా రూ.90 కోట్ల మేరకు ఆర్డర్లు వస్తుంటాయి. పాఠశాలలు, గురుకులాలు తెరిచేనాటికి దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేయడం రివాజు. 2020లో కొవిడ్‌ కారణంగా పాఠశాలలు మూతపడ్డాయి. 2021లోనూ కరోనా కొనసాగడంతో ఆ సంవత్సరాల్లో ఆర్డర్లు లభించక సంస్థ బాగా నష్టపోయింది. 2022 సంవత్సరానికి సైతం ఇప్పటి వరకు ఆర్డర్లు రాలేదు. వాస్తవానికి ఏటా జనవరిలోపే టెస్కోకు ఆర్డర్లు ఇవ్వాలి. అయిదు నెలల్లోపు వాటిని తయారు చేయించి పంపిణీ చేయాలి.

పేరుకుపోయిన నిల్వలు
Corona Effect on TSCO : కరోనా కారణంగా టెస్కో దుకాణ సముదాయాల్లో విక్రయాలు 50% తగ్గాయి. ఏటా రూ.300 కోట్ల మేరకు ఆదాయం దుకాణాల్లో విక్రయాల ద్వారా వస్తుంది. 2020 నుంచి కొవిడ్‌ ప్రారంభం కాగా... చాలా నెలల పాటు దుకాణాలు మూసే ఉన్నాయి. 2021లోనూ ఇదే పరిస్థితి. దీంతో రూ.200 కోట్ల అమ్మకాలు తగ్గాయి. గోదాముల్లో, దుకాణాల్లో నిల్వలు పేరుకుపోయాయి.

2017లో నిర్ణయించిన ధరనే..
సాంకేతిక నిపుణులు సహకార సంఘాలను సందర్శించి నేసిన వస్త్రాల నాణ్యతను పరిశీలిస్తారు. వస్త్రాల తయారీకి అయిన ఖర్చును లెక్కిస్తారు. రోజుకు రూ.200 కూలీని కలిపి ఆ వస్త్రానికి ధర నిర్ణయిస్తారు. నిపుణులు 2017లో మగ్గాలపై నేసిన వస్త్రాలను పరిశీలించి అప్పటి ముడి సరుకుల రేట్లను విశ్లేషించి ధరలను నిర్ణయించారు. ఏడాదికోసారి ధరలు నిర్ణయించాల్సి ఉన్నా.. ఇప్పటికీ అయిదేళ్ల క్రితం నిర్ణయించిన ధరలకే టెస్కో వస్త్రాలను కొనుగోలు చేస్తుంది. చేనేత కార్మికులకు కూడా 2017లో నిర్ణయించిన ధరనే ఇప్పుడు చెల్లిస్తుంది.

"ధరలు పెంచాలి.. :ముడి సరుకుల ధరలు పెరిగాయి. పెరిగిన ముడి సరుకుల ధరలకు అనుగుణంగా ధరలు నిర్ణయించాలని చేనేత, జౌళి శాఖ సంచాలకులకు గతేడాది వినతిపత్రం ఇచ్చాం. ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు."

- వి.శ్రీమన్నారాయణ, అధ్యక్షుడు, కొయ్యలగూడెం, చేనేత సంఘం, యాదాద్రి భువనగిరి జిల్లా

ఆర్డర్ల కోసం ప్రయత్నిస్తున్నాం : "గత ఏడాది పాఠశాలలు, గురుకులాల మూసివేత వల్ల ప్రభుత్వ శాఖల నుంచి ఆర్డర్లు రాలేదు. ఈ ఏడాది సైతం ఇప్పటికీ రాలేదు. కొంత ఆలస్యమైనా వీటిని పొందేందుకు ప్రయత్నిస్తున్నాం."

- శైలజా రామయ్యర్‌, టెస్కో ఎండీ

ABOUT THE AUTHOR

...view details