రైతు వ్యతిరేక చట్టాలపై.. కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ రచించిన తిరగబడ్డ ట్రాక్టర్లు అనే పుస్తకాన్ని సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తి ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నారాయణ మూర్తి.. మొదటి పుస్తకాన్ని భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సంహ రెడ్డికి అందించారు.
రైతుకు కష్టం తెచ్చే చట్టాలు తీసుకురావద్దు : ఆర్.నారాయణమూర్తి
దేశానికి రైతు వెన్నెముక, అలాంటి అన్నదాత నడ్డి విరిచేస్తారా అని ప్రశ్నించారు సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి. ఒకే దేశం-ఒకే మార్కెట్ పేరుతో రైతులను మోదీ మోసం చేస్తున్నారని విమర్శించారు.
తిరగబడ్డ ట్రాక్టర్, ఆర్.నారాయణమూర్తి
మోదీ తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు నారాయణమూర్తి తెలిపారు. దిల్లీ సరిహద్దుల్లో ఆరునెలలుగా రైతులు చేస్తున్న మహోన్నతమైన ఉద్యమానికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని కోరారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కర్షకునికి నష్టం చేకూర్చే చట్టాలు వద్దని అన్నారు.
Last Updated : Apr 3, 2021, 1:43 PM IST