తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhongir Fort: అభివృద్ధికి నోచుకోని భువనగిరి కోట.. 'హామీలు మాటలకే పరిమితమా?'

రామప్ప గుడికి యునెస్కో(UNESCO) గుర్తింపు వచ్చిన నేపథ్యంలో అంతే చారిత్రక ప్రాధాన్యం ఉన్న భువనగిరి కోటకు(Bhongir Fort) సరైన గుర్తింపు దక్కడం లేదని స్థానికులు వాపోతున్నారు. కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అద్భుతమైన కోట మసకబారుతోందని అంటున్నారు. కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఒక్కటీ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Bhongir Fort, Bhongir Fort development
అభివృద్ధికి నోచుకొని భువనగిరి కోట, భువనగిరి కోట అభివృద్ధికి ఆమడ దూరం

By

Published : Aug 8, 2021, 8:37 AM IST

భువనగిరి కోట(Bhongir Fort) అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి అంతర్జాలంలో చూసి పర్యాటకులు వస్తున్నారని పేర్కొన్నారు. కోటపైన ఉన్న ప్రధాన ద్వారాలు, కోట నిర్మాణ శైలి చూపరులను కట్టి పడేస్తుంది. భువనగిరి కొండ అంచుల్లో కోట ప్రహారీ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. శత్రు దుర్భేద్యంగా పెద్ద రాళ్లను కొండ అంచుల్లో ఎలాంటి పునాది లేకుండా కోట గోడ నిర్మించడంలో గొప్ప ఇంజినీరింగ్ నైపుణ్యం కనిపిస్తుంది.

'కోట అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. భువనగిరి కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గతంలో ప్రభుత్వం రూ.16.50 కోట్లను అంచనా వేసింది. వాటితో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నిర్మాణాలతో పాటు తీగ మార్గం (రోప్ వే ) నిర్మించాలని ప్రతిపాదించారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సందర్శించారు. కానీ కోట అభివృద్ధి పనులు ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు.'

-స్థానికులు

క్రీ.శ.1126 లో త్రిభువన మల్లవిక్రమాదిత్యుని కాలంలో భువనగిరి కోట అభివృద్ధి చెందింది. వీరు కల్యాణి చాళుక్యుల వంశానికి చెందిన వారు. అంతకుముందు విష్ణుకుండినులు పాలించేవారని ఇక్కడి పరిసర ప్రాంతాల్లో దొరికిన నాణేల ఆధారంగా చరిత్రకారులు నిర్ధారించారు. భువనగిరి కొండపై ఉన్నట్లువంటి నీటి కొలనులు... వాన నీటిని నిల్వ చేయడానికి నిర్మించినట్లు తెలుస్తోంది. వివిధ వంశాల రాజులు భువనగిరి కోటను పరిపాలనకు కాకుండా... సైనిక, రాజ్య రక్షణ అవసరాలకు మాత్రమే వినియోగించుకున్నారు. భువనగిరి కోట కల్యాణి చాళుక్యులు, మున్సూర్ కాపునాయకులు, కాకతీయులు అనంతరం ముస్లిం రాజులు సైనిక అవసరాల కోసం వినియోగించుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 18వ శతాబ్దంలో సర్దార్ సర్వాయి పాపన్న ఈ కోటను సైనిక స్థావరంగా చేసుకొని గోల్కొండ కోటను ఆక్రమించారు.

కోట నిర్వహణ కోసం పూర్తి స్థాయి సిబ్బందిని నియమించలేదు. ఒక్క చౌకీ దార్, ఇద్దరు సెక్యూరిటీ గార్డ్‌లు మాత్రమే సంరక్షిస్తున్నారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కూడా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. ప్రతి నెల కోట సందర్శించే పర్యాటకుల నుంచి నెలకు దాదాపు రూ.40 వేల నుంచి రూ.95 వేల ఆదాయం సమకూరుతుంది. కోట వద్ద 2013లో తీగ మార్గాన్ని(రోప్ వే ) ప్రతిపాదించారు. నిర్మాణానికి బైపాస్ రోడ్డు సమీపంలో 2.36 ఎకరాల భూమిని సేకరించి, అక్కడ కంచెను ఏర్పాటు చేశారు. తదుపరి అవసరాల కోసం మరో రెండు ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు.

తీగ మార్గం కోసం కోల్‌కతాకు చెందిన రోప్ వే రిసార్ట్ అనే సంస్థ ముందుకు వచ్చింది. అంచనా వ్యయాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కేఎస్‌ఆర్ సంస్థ సాయిల్ టెస్టింగ్ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ తర్వాత ఏ పనులు కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాంతంలో తీగ మార్గం ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో తీగ మార్గం (రోప్ వే) ఉన్న పర్యాటక కేంద్రం ఇప్పటివరకు ఒక్కటీ లేదు. కోట వద్ద రాక్ క్లైంబింగ్, జిప్‌లైన్ అనే సాహస క్రీడ కూడా త్వరలో రాబోతుంది. దానికి సంబంధించి ట్రయల్ రన్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని అభివృద్ధి చేయాలి.

అభివృద్ధికి నోచుకోని భువనగిరి కోట.. 'హామీలు మాటలకే పరిమితమా?'

ఇదీ చదవండి:National Handloom Day: శతాబ్దాల చేనేత సోయగం.. తగ్గని వస్త్ర'రాజసం'

ABOUT THE AUTHOR

...view details