తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri: నయనానందకరం... భక్తులకు త్వరలోనే సుందర యాదాద్రి దర్శనం - తెలంగాణ వార్తలు

భక్తజన సందోహం ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి పుణ్యక్షేత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఆలయాన్ని విశ్వఖ్యాతి పొందేలా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కాగా మరోసారి క్షేత్ర సందర్శనకు సీఎం వెళ్లనున్నారని సమాచారం. సీఎం దిశానిర్దేశంతో జరిగిన పురోభివృద్ధిపై ‘ఈటీవీ భారత్’ ప్రత్యేక కథనం.

Yadadri sri Lakshmi narasimha swamy temple reconstruction, cm kcr about sri Lakshmi narasimha swamy temple reconstruction
యాదాద్రిలో పూర్తి కావొచ్చిన ఆలయాల పునర్నిర్మాణాలు, యాదాద్రిపై సీఎం కేసీఆర్ సమీక్ష

By

Published : Sep 14, 2021, 12:22 PM IST

యాదాద్రిలో పూర్తి కావొచ్చిన ఆలయాల పునర్నిర్మాణాలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రీశుడి పుణ్యక్షేత్రాభివృద్ధికి శ్రీకారం చుట్టి ఐదేళ్లు కావొస్తోంది. ఈ క్షేత్రాన్ని విశ్వఖ్యాతి చెందేలా రూపొందించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానాలయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు. గత జూన్‌ 21న క్షేత్రాన్ని సందర్శించిన ఆయన అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. ఆయన జారీ చేసిన ఆదేశాలతో పనులను చకాచకా పూర్తి చేస్తున్నారు.

విద్యుద్దీపాల వెలుగులో గోపురాలు

కొండపైన నిర్మాణాల తీరు..

సరిగ్గా 84 రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ క్షేత్రాన్ని సందర్శించిన తర్వాత ఆయన దిశానిర్దేశంతో యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ(YTDA)) పనుల్లో వేగం పెంచింది. కొండపైన హరి, హరుల ఆలయాల పునర్నిర్మాణాలు పూర్తికావడంతో తుది మెరుగులపై దృష్టిసారించింది. ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఫ్లొరింగ్‌, ఉద్యానం పనులు పూర్తి చేయించింది. వార్షిక బ్రహ్మోత్సవ రథశాలకు షెట్టరు, కలశాలు బిగించారు. వీఐపీ లిఫ్టునకు శ్రీస్వామి, అమ్మవారి విగ్రహం, తిరునామాలతో హంగులు అద్దారు.

  • ప్రసాదాల తయారీ, విక్రయ కాంప్లెక్స్‌లో యంత్రాలు బిగించారు. వాటిని రూ.13 కోట్ల వ్యయంతో ముంబయి, పుణె నుంచి రప్పించి, హరేరామ-హరేకృష్ణ సంస్థకు చెందిన అక్షయపాత్ర పర్యవేక్షణలో ఇటీవలే అమర్చారు. యంత్రాల పనితీరు పరిశీలనకు నిర్ణయించారు. తేదీ ఖరారు కావాల్సి ఉంది. విక్రయ కౌంటర్లు ఏర్పాటవుతున్నాయి.
  • దైవదర్శనాలకు సుమారు నాలుగు వేల మంది భక్తులు వేచిఉండేలా కింది అంతస్తు కలుపుకొని నాలుగు అంతస్తుల సముదాయాన్ని విస్తరించారు. ఉత్తర దిశలో మందిరం ఆకార హంగులతో తీర్చిదిద్దే పనులను వేగవంతం చేశారు. క్యూలైన్లను ఏర్పరిచారు.
  • ఆలయం మాడ వీధిలో బంగారు వర్ణంతో కూడిన ప్రత్యేక దర్శన వరుసల పనులు కొద్ది రోజుల్లో పూర్తికానున్నాయి.
  • శివాలయం ప్రహరీ ఎత్తు తగ్గించి దిమ్మెలపై ఇత్తడి తొడుగులు, వాటిపై త్రిశూలం వంకుల ఆకృతిలో విద్దుద్దీపాలు బిగించారు. ఎదురుగా స్వాగత తోరణం నిర్మితమైంది. పచ్చదనం పనులు జరుగుతున్నాయి. రథశాల నిర్మితమవుతోంది.
  • విష్ణు పుష్కరిణి పునరుద్ధరణ కొనసాగుతోంది. బస్‌బే కోసం బండ తొలగింపు, చదును చేపట్టారు. మెట్లదారి నిర్మాణం నెలలో పూర్తయ్యే అవకాశం ఉంది.
ముస్తాబవుతున్న పుణ్యక్షేత్రం
  • కొండపైన ఉత్తర దిశలో చేపట్టిన రక్షణ గోడ నిర్మాణం పూర్తికావొచ్చింది. ఆ ప్రాంగణంలోని లోయను పూడ్చి చదును చేస్తున్నారు. బస్‌బే, మినీ పార్కింగ్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
  • కృష్ణ శిలతో రూపొందించిన ఆలయ ప్రాంగణం, రాజగోపురాలతో సహా మండప ప్రాకారాలు, సహజత్వానికి అనుగుణంగా సాదృశ్యమయ్యేలా బెంగళూరుకు చెందిన సంస్థ ద్వారా విద్యుద్దీపాలను బిగిస్తోంది. ఈ ఏర్పాట్లు తుదిదశకు చేరాయి.
  • దర్శనానికి వెళ్లే భక్తుల్లో నడవలేని వారి కోసం ప్రత్యేక కదిలే మెట్లు(ఎస్కలేటర్‌) ఏర్పాట్లు మొదలయ్యాయి. రూ.కోటి వ్యయంతో మూడు కదిలే మెట్లు బిగిస్తున్నారు.
  • వీఐపీల కోసం ఏర్పాటైన లిఫ్ట్‌ గదిని మందిర రూపంగా తీర్చిదిద్దారు. స్వామి రథశాల సంప్రదాయ హంగులతో ఆవిష్కృతమైంది. ఆలయం తూర్పు మాడ వీధుల్లో పచ్చదనం పెంచారు.
ఆధ్యాత్మిక క్షేత్రంగా పునర్నిర్మాణం

విడిది.. ఆహ్లాదం

  • ఈ క్షేత్ర సందర్శనకు వచ్చే దేశ, విదేశీయుల విడిది కోసం దాతలు విరాళంగా ఇచ్చిన రూ.104 కోట్లతో నిర్మిస్తున్న ‘ప్రెసిడెన్షియల్‌ సూట్ల’లో 13 విల్లాలు, ఒక ప్రెసిడెన్షియల్‌ భవనం పూర్తయ్యింది. మరో విల్లా కట్టాల్సి ఉంది.
  • దైవదర్శనాలకు వచ్చే యాత్రికులకు మానసిక ఆహ్లాదం కలిగించేలా పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దుతున్నారు. కొండ చుట్టూ వివిధ రకాల మొక్కలు, పూల మొక్కల పెంచుతున్నారు. కనుమ, గిరి ప్రదక్షిణ దారులనూ హరితమయంగా మార్చారు.

కొండ కింద..
గండి చెరువు చెంత సిద్ధమైన లక్ష్మీ పుష్కరిణి

  • క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు కొండకింద గండి చెరువు పరిసరాల్లో లక్ష్మీ పుష్కరిణి(గుండం)ను 2.20 ఎకరాల్లో రూ.11.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పనులు తుదిదశకు చేరాయి. ఇటీవలే పుష్కరిణిలోకి నీళ్లు నింపి ప్రయోగాత్మక పరిశీలన చేపట్టారు. ఆర్నమెంటల్‌ పనులు మిగిలాయి.
  • దీక్షా భక్తుల బస కోసం 18 వేల చ.అ. విస్తీర్ణంలో రూ.8.35 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మండప భవనం తుది దశకు చేరింది.
  • రూ.20.30 కోట్ల వ్యయంతో 2.23 ఎకరాల విస్తీర్ణంలో కల్యాణకట్ట నిర్మాణం పూర్తికావొచ్చింది. ఆర్నమెంటల్‌ పనులు జరగాల్సి ఉంది. ఇక్కడ అంతర్గత రహదారులు నిర్మిస్తున్నారు.
పూర్తి కావొచ్చిన పునర్నిర్మాణం

ముఖ్యమంత్రి వస్తున్నారని ముమ్మర ఏర్పాట్లు

క్షేత్రాభివృద్ధి పనులను పరిశీలించి, ఆలయ ఉద్ఘాటనకు ముహూర్తం నిశ్చయానికి రాష్ట్ర సీఎం కేసీఆర్‌ త్వరలో ఇక్కడికి వస్తున్నారని యాదాద్రిలో సోమవారం ఏర్పాట్లు చేపట్టారు. స్థానిక మున్సిపల్‌ పారిశుద్ధ్యం కార్మికులు గండిచెరువు పరిసరాల్లోని దారుల్లో మట్టి తొలగించి ఊడ్చే పనులు చేపట్టారు. యాడా ఆధ్వర్యంలో కనుమదారుల్లో ఇరువైపులా మొక్కలు నాటారు. మట్ట దారులను మెరుగుపరుస్తున్నారు. ప్రధాన రహదారి విస్తరణ, వైకుంఠ ద్వారం వద్ద సర్కిల్‌ను తీర్చిదిద్దుతున్నారు. కొండపైన ర్యాంపు నిర్మిస్తున్నారు. ఆలయం చెంత స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:CM KCR: యాదాద్రికి సీఎం.. 17న చినజీయర్​ స్వామితో కలిసి పర్యటన!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details