యాదాద్రీశుని చెంత ముస్తాబవుతున్న గండి చెరువు Gandi cheruvu in yadadri : యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి నిత్య కైంకర్యాలకు, భక్తుల పవిత్ర స్నానాలకు, భవిష్యత్తులో పుష్కరాల నిర్వహణకు వీలుగా పుణ్య గోదావరి గలగలమంటూ తరలివస్తోంది. నదీ తీరంలోని పుణ్యక్షేత్రాలను తలపించేలా యాదాద్రిని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలకు అనుగుణంగా గండి చెరువు సిద్ధమవుతోంది. అందులో భాగంగా 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గండిచెరువులోకి చేర్చే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
పుణ్య పుష్కరిణిగా అభివృద్ధి
యాదాద్రికి వచ్చే భక్తుల పుణ్యస్నానాలకు వీలుగా కొండ కింద గండి చెరువు చెంత లక్ష్మీ పుష్కరిణి, కొండపైన స్వామి వారి కైంకర్యాల కోసం విష్ణు పుష్కరిణి నిర్మించిన విషయం తెలిసింది. వీటికి నిరంతరం నీరందించేలా గండి చెరువును రూ.33 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులో నీటినిల్వ సామర్థ్యం పెంచడానికి వీలుగా ఎనిమిది మీటర్లలోతు పూడికతీస్తూ చుట్టూ రక్షణ గోడ(రిటైనింగ్ వాల్) నిర్మిస్తున్నారు. రక్షణ గోడ, వలయ రహదారి మధ్యలో ఆహ్లాదాన్ని పంచేలా ఉద్యానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. చెరువులో మురుగు, వర్షాల తాలూకూ వరద జలాలు కలవకుండా ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు నెలలకోసారి కాళేశ్వరం జలాలు నింపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చెరువు నీరు బయటికి వెళ్లేలా మూడు మీటర్ల ఎత్తులో తూము(అప్‌టైన్ స్లూయిజ్) నిర్మిస్తున్నారు. ‘సైదాపూర్ కాల్వ నుంచి గండి చెరువులోకి గోదారి జలాలను తీసుకొచ్చే పైపులైన్ పనులు మొదలయ్యాయి. గండి చెరువులో ఎప్పుడూ పరిశుభ్రమైన నీళ్లే ఉండేలా నిర్మాణాన్ని తీర్చిదిద్దుతున్నాం. మార్చి 28న జరిగే ప్రధానాలయ మహాకుంభ సంప్రోక్షణకు ముందే అన్ని పనులు పూర్తిచేస్తాం’ అని ఆర్‌అండ్‌బీ డీఈఈ బీల్యానాయక్ తెలిపారు.
ఇదీ చూడండి:CM KCR visit to Yadadri: త్వరలో యాదాద్రికి సీఎం కేసీఆర్.. స్వామి సేవలో కేంద్ర మంత్రి