Mariamma Custodial Death case: మరియమ్మ మృతిపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరైన రీతిలోనే జరుగుతోందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. మరియమ్మ కస్టోడియల్ మృతిపై విచారణ ముగించిన హైకోర్టు.. ఈ కేసులో తార్కిక ముగింపు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అభిప్రాయపడింది.
Mariamma Custodial Death : 'మరియమ్మ కేసు ముగింపు బాధ్యత ప్రభుత్వానిదే' - హైకోర్టు లేటెస్ట్ అప్డేట్స్
10:51 November 29
మరియమ్మ మృతిపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హైకోర్టు
మరియమ్మ కస్టోడియల్ మృతిపై ప్రస్తుత దశలో ఎలాంటి చర్యలు అవసరం లేదని.. దాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ ముగించింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసులు మరియమ్మను దొంగతనం కేసులో విచారించారు. స్టేషన్‌కు తీసుకురాగా ఆమె అనారోగ్యానికి గురయ్యారని పోలీసులు చెబుతున్నారు. విచారణలో చిత్రహింసలు పెట్టడం వల్లే మరియమ్మ చనిపోయారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే ఎస్సైతో పాటు ఇద్దరు కానిస్టేబుల్స్‌పై వేటుపడింది.
ఏం జరిగిందంటే...
ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన మరియమ్మ... యాదాద్రి జిల్లా గోవిందాపురంలో చర్చి పాస్టర్ బాలశౌరి ఇంట్లో వంటమనిషిగా పనిచేశారు. ఈనెల జూన్ 3న ఆమె కుమారుడు ఉదయ్‌కిరణ్‌తో పాటు అతడి స్నేహితుడు శంకర్... గోవిందాపురం వచ్చారు. ఈనెల 5న ఫాదర్ పని మీద హైదరాబాద్ వెళ్లారు. మరుసటి రోజు వచ్చేసరికి... ఇంట్లో 2 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. డబ్బుల విషయమై మరియమ్మను పాస్టర్ ప్రశ్నించారు. మర్నాడు మరియమ్మతోపాటు ఆమె కుమారుడు... రాత్రికి రాత్రే పరారయ్యారు. సొమ్ము పోయిందని అడ్డగూడురు పోలీస్ స్టేషన్‌లో ఫాదర్ ఫిర్యాదు చేశారు. కేసులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు.... అదే నెల 18న మరియమ్మను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. దొంగతనం కేసు విచారణలో పీఎస్‌కు తరలిస్తుండగా ఆవరణలోనే స్పృహతప్పి పడిపోవడం వల్ల భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు ఎస్సై వి.మహేశ్ చెప్పారు. మృతురాలి స్వగ్రామం ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడ.
పోలీసులు కొట్టడంతోనే మరియమ్మ మరణించినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశిస్తూ... చర్యలు చేపట్టారు. స్థానిక ఎస్సై మహేశ్, కానిస్టేబుళ్లు రషీద్, జానయ్యపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిని భువనగిరి జోన్ డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్న కేసీఆర్
ఎస్సీ మహిళ మరియమ్మ లాకప్‌డెత్ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదన్నారు. మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కుమారుడు ఉదయ్‌కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు... 15 లక్షల పరిహారం, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షలు ఆర్థిక సాయంగా అందించాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. కేసు పూర్వపరాలను తెలుసుకుని... అవసరమైతే బాధ్యులను ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు.