KCR at Yadadri Today : మహాదివ్య హరిహరుల క్షేత్రం యాదాద్రిలో పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయం పునఃప్రారంభం కనుల పండువగా సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో లక్ష్మీనారసింహుడి ప్రధానాలయంతో పాటు అనుబంధ శివాలయ పునర్నిర్మాణాలు పూర్తయ్యాయి. గత నెల 28న పంచనారసింహుల సన్నిధిని మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన పర్వం నిర్వహించారు. అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటనలో భాగంగా... ఈ నెల 20 నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఈ ఆలయ ఉద్ఘాటన పర్వం సోమవారం నిర్వహించి నిజ దర్శనాలు కల్పించనున్నారు.
KCR at Yadadri Temple : ప్రధానాలయాన్ని పునఃనిర్మాణ సమయంలోనే.... ఈ శివాలయాన్ని ఎకరా స్థలంలో నిర్మించారు. ఆంజనేయస్వామి, నవగ్రహ,మరకత మండపాలు, రామాలయం, ఆలయం చుట్టూ ప్రాకారాలను నిర్మించారు. శివాలయంలో భాగంగానే ఆంజనేయస్వామి, గణపతి, పర్వతవర్ధినీ అమ్మవారి దేవాలయాలు, యాగశాలను నిర్మించారు. శివాలయ ముఖ మండపం ఎదురుగా ధ్వజ స్తంభానికి వెనుక వైపున ఆవరణలో ప్రత్యేక పీఠంపై నంది విగ్రహాన్ని ఏర్పాటు చేయగా... ఆలయ స్వాగత తోరణానికి శివపార్వతుల విగ్రహాలను అమర్చారు.
KCR at Shivalayam in Yadadri : శివాలయ ఉద్ఘాటన ఉత్సవాల్లో భాగంగా.... మహాకుంభాషేక ఉత్సవాలు కొనసాగుతుండగా... ధనిష్ఠా నక్షత్ర సుముహూర్తాన ఉద్ఘాటనకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగానే... ఉదయం నుంచి ద్వారతోరణపూజ స్థాపిత దేవతాయజన, ప్రాసాద దిక్‌స్థుండిల హోమాలు, వ్యాహృతి హోమాలు, శతకృత్వోభి మంత్రణం, దేవమస్తకాభిషేకం, గర్తన్యాసం నిర్వహించారు.