యాదాద్రిలో పర్యటిస్తోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయంలో స్వామివారికి మొక్కుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఉన్నారు.
CM KCR YADADRI VISIT : యాదాద్రీశుడి సన్నిధిలో సీఎం కేసీఆర్ - CM KCR visit to yadadri temple
11:20 October 19
CM KCR YADADRI VISIT : యాదాద్రీశుడి సన్నిధిలో సీఎం కేసీఆర్
మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో యాదాద్రికి బయలుదేరిన సీఎం.. 12.40కి చేరుకున్నారు. ఆలయ పరిసరాలను ఏరియల్ వ్యూ ద్వారా తిలకించారు. అనంతరం కాన్వాయ్‌లో ఘాట్‌రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. తుది దశ పనులపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆలయ నిర్మాణం చూసి అధికారులు, శిల్పులు, ఇంజినీర్ల పనితీరును మెచ్చుకున్నారు.
యాదాద్రి ప్రధానాలయంలోని రామానుజ కూటమిని కేసీఆర్ తిలకించారు. దక్షిణ ద్వారం నుంచి పై అంతస్తుకు చేరుకుని... విద్యుత్తు దీపాల అలంకరణ, గర్భాలయం ముఖద్వారంపై ఏర్పాటైన ప్రహ్లాద చరితం పలకలను సందర్శించారు. తిరిగి మొదటి ప్రాకారంలోని మాడ వీధుల్లోకి చేరుకుని... గోపురాలను పరిశీలించారు. ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు... నిర్మాణాల తీరును ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం యాదాద్రీశుడి సన్నిధికి కేసీఆర్ చేరుకున్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెట్టాలని, ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, కరోనా మహమ్మారి పీడ తొలగాలని స్వామిని వేడుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలకు వేదపండితులు వేదాశీర్వాచనాలు అందజేశారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులతో పాటు.. గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు, యాడా అధికారులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన ముహూర్తం ప్రకటించనున్నారని సమాచారం. మహా సుదర్శనయాగం వివరాలూ వెల్లడిస్తారని తెలుస్తోంది.