Swagatha Thoranam in Yadadri: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిర్మితమవుతున్న భారీ స్వాగత తోరణం వచ్చే ఫిబ్రవరి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లోగా ఆవిష్కృతం కానుంది. ఈ తోరణం కృష్ణ శిలను పోలిన రంగు శిలలతో రూపుదిద్దుకోనుంది. కొండపైన కనుమ దారులను కలుపుతూ, వాటి మధ్య 40 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో ఈ తోరణం నిర్మించారు. ఈ క్షేత్రాభివృద్ధికి సంకల్పించిన సీఎం కేసీఆర్.. ఆలయ సన్నిధిలో చేపట్టే నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికతను చాటేలా ఉండాలన్న సూచనతో వైటీడీఏ స్వాగత తోరణం నిర్మాణం పట్ల ప్రత్యేక దృష్టి సారించింది.
దేశంలో మరెక్కడా లేని సంపూర్ణంగా కృష్ణశిలతో పునర్నిర్మితమైన పంచ నారసింహుల దివ్యాలయానికి తగ్గట్లు ఆలయ పరిసరాలలో ఇతర కట్టడాల నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సిమెంట్‌తో భారీ స్వాగత తోరణం నిర్మించారు. ఇది యాదాద్రికి వచ్చే భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వైష్ణవతత్వం ఉట్టిపడేలా ఈ తోరణాన్ని ఏర్పాటు చేయనున్నారు.