Orphan Kids story in Yadadri : విధి వక్రీకరించడంతో ఓ కుటుంబంలోని ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. ఐదేళ్ల కిందట తల్లి అనారోగ్యంతో మృతిచెందగా..... 4 రోజుల క్రితం తండ్రి మరణం తీవ్ర వేదనకు గురిచేసింది. చిన్నారుల జీవితానికి తీరని శోక సంద్రాన్ని మిగిల్చింది. మాటలు రాని, చెవులు వినపడని ఓ సోదరుడితో.... మరో ఇద్దరి బాగోగులు చూసుకుంటున్న ఓ ముసలి నానమ్మతో ఆ కుటుంబం జీవనం సాగిస్తున్నారు. దాతలెవరైనా స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం చిర్రగూడూరుకు చెందిన బొడ్డు నాగయ్య కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందగా... దహన సంస్కారాలకు సైతం డబ్బులు లేకపోవడంతో గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో మృతదేహాన్ని తరలించి..... దహన సంస్కారాలు నిర్వహించారు. నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగయ్య భార్య లక్ష్మీ ఐదేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో 12 ఏళ్ల కుమార్తె, 9 ఏళ్ల మూగ బాలుడు, ఏడేళ్ల బాలుడు హైదరాబాద్‌లోని అనాథ హాస్టళ్లలో ఉంటూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. నాలుగు నెలల క్రితమే నాగయ్య తండ్రి సోమయ్య కూడా క్యాన్సర్ వ్యాధితో చనిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయి బిక్కుబిక్కుమంటూ నాయనమ్మ దగ్గర ఉంటున్నారు. ఎవరైనా తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.