తెలంగాణ

telangana

ETV Bharat / state

నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ.. స్వయంభువునికి కేసీఆర్​ తొలిపూజ.. - Yadadri Temple Reopening news

Yadadri Temple Reopening : అడుగడుగునా ఆధ్యాత్మికం వెల్లివిసిరింది. అబ్బురపరిచే అద్భుత ఘట్టాలు కళ్లముందు ఆవిష్కృతమయ్యాయి. చూపు తిప్పుకోనివ్వని శిల్పకళలు... మదిని దోచే కట్టడాలతో రూపుదిద్దుకున్న మహాదివ్య కోవెలలో... నేత్రపర్వంగా సాగిన మహాకుంభ సంప్రోక్షణ భక్తకోటిని తన్మయత్వానికి గురిచేసింది. ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం యాదాద్రిలో ఆరేళ్ల తర్వాత లక్ష్మీనరసింహుడు ప్రధాన ఆలయంలో కొలువుదీరాడు. వారం రోజుల పంచకుండాత్మక యాగం మహాపూర్ణాహుతి ఇచ్చి.... బాలాలయం నుంచి బంగారు కవచమూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తీసుకెళ్లారు.

Started Yadadri Temple Reopening process and cm kcr is the first devotee to start
Started Yadadri Temple Reopening process and cm kcr is the first devotee to start

By

Published : Mar 28, 2022, 10:04 AM IST

Updated : Mar 28, 2022, 3:17 PM IST

నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ.. స్వయంభువునికి కేసీఆర్​ తొలిపూజ..

Yadadri Temple Reopening : లక్ష్మీనారసింహులు నివసించే నవవైకుంఠం.. ఇకపై శోభాయమానంగా దర్శనీయనుంది. చారిత్రక ప్రాశస్త్యం... ఆధునిక సోయగం కలగలిసిన పవిత్ర భూమి... తరతరాలు నిలిచిపోనుంది. ఆలయ పునరుద్ధరణ కారణంగా... ఆరేళ్లుగా బాలాలయంలోనే కొలువై భక్తులకు దర్శనమిచ్చిన లక్షీనృసింహుడు... తిరిగి తన నివాసానికి చేరుకున్నారు. దేదీప్యమానంగా వెలిగి పోతున్న గర్భగుడి నుంచి భక్త జనసందోహానికి కాసేపట్లో అభయం ఇవ్వనున్నారు. వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా నిర్ణయించిన ముహూర్తం మేరకు... 7 రోజుల పాటు పంచకుండాత్మక మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాన్ని.. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం వైభవోపేతంగా నిర్వహించారు. మార్చి 21న ప్రారంభమైన ఈ సంప్రోక్షణలో వేద పారాయణాలు, మూల మంత్రాల జపం నిర్వహించారు. బాలాలయంతో పాటు ప్రధాన ఆలయంలోనూ ఇందుకు సంబంధించిన క్రతువు జరిపారు. స్వస్తి వాచనం, యజ్ఞ హవనములు, మూల మంత్ర హవనములు, సామూహిక శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం తదితర శాస్త్రోక్తక క్రతువులు జరిపారు.

7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ

యాదాద్రిలో కేసీఆర్..:ఉదయం 9 గంటలకు మహాపూర్ణాహుతితో మహాకుంభ సంప్రోక్షణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. యాదాద్రి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసమేతంగా ఆలయం వద్దకు చేరుకున్నారు. హెలికాఫ్టర్​లో నేరుగా యాదాద్రి చేరుకున్న ఆయన.. ఆలయంపై విహంగ వీక్షణం చేశారు. బాలాలయంలోని బంగారు కవచ మూర్తులు, ఉత్సవ విగ్రహాలు, అళ్వార్లతో.. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, కళాప్రదర్శనల మధ్య శోభాయాత్ర వైభవంగా జరిగింది.

బాలాలయం నుంచి బయలుదేరిన శోభాయాత్ర

వైభవంగా శోభాయాత్ర..: సీఎం కేసీఆర్ మడి వస్త్రాలు ధరించి​.. నేరుగా వచ్చి సతీసమేతంగా శోభయాత్రలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో సీఎం కుటుంబసభ్యులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. ప్రధానాలయ పంచతల రాజగోపురం వద్ద కేసీఆర్​ స్వయంగా పల్లకిని మోశారు. పంచకుండాత్మక యాగం పూర్ణాహుతి అనంతరం.. బాలాలయం నుంచి వేదమంత్రోశ్చరణల నడుమ స్వామివారి సువర్ణమూర్తుల శోభాయాత్ర వైభవంగా సాగింది. ఆరేళ్ల తర్వాత స్వామివారు బాలాలయం నుంచి తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి ప్రవేశించారు. శోభాయాత్రలో భాగంగా పునర్‌నిర్మితమైన ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ప్రదక్షిణలు నిర్వహించారు.

శోభాయాత్రలో సతీసమేతంగా పాల్గొన్న సీఎం కేసీఆర్​

ఏకకాలంలో ఏడు గోపురాలపై..:వారం రోజుల పాటు పంచకుండాత్మక యాగంలో పూజించిన నదీ జలాలతో విమాన గోపురం, ఇతర గోపురాలకు నిర్వహించిన మహాకుంభ సంప్రోక్షణ నేత్రపర్వంగా సాగింది. 7 గోపురాలపై ఉన్న కలశాలకు ఏకకాలంలో కుంభాభిషేకం, సంప్రోక్షణ జరిపారు. రాజగోపురాలపైన స్వర్ణ కలశాలకు 92 మంది రుత్వికులతో సంప్రోక్షణ జరిగింది. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి ముఖ్యమంత్రి సమక్షంలో మహాసంప్రోక్షణ నిర్వహించారు.అదే సమయంలోమంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన గోపురాలు, ప్రాకార మండపాలకు సంప్రోక్షణ నిర్వహించారు. ఆంజనేయస్వామి సన్నిధిలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, గరుడ ఆళ్వార్‌ సన్నిధిలో సభాపతి పోచారం, తూర్పు రాజగోపురం వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంప్రోణక్షలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రాకార మండపం-22కు మంత్రి తలసాని, 24వ మండపం వద్ద హరీశ్‌రావు, పశ్చిమ రాజగోపురానికి జగదీశ్‌రెడ్డి, దక్షిణ రాజగోపురానికి నిరంజన్‌రెడ్డితో పాటు... మిగతా మంత్రులు, ఉన్నతాధికారులు తమకు కేటాయించిన చోట సంప్రోక్షణ, అభిషేకాల్లో పాల్గొన్నారు.

దివ్య విమానంపై సుదర్శన చక్రానికి కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ
మహాకుంభ సంప్రోక్షణలో మంత్రి నిరంజన్​రెడ్డి దంపతులు
సంప్రోక్షణ క్రతువులో మంత్రి కొప్పుల ఈశ్వర్​ దంపతులు
సంప్రోక్షణలో మంత్రి జగదీశ్​ రెడ్డి కుటుంబం
సంప్రోక్షణలో సతీసమేతంగా మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​
సంప్రోక్షణలో పాల్గొన్న మంత్రి హరీశ్​రావు, ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి
కుంభాభిషేకంలో మంత్రి మల్లారెడ్డి దంపతులు, మోత్కుపల్లి నర్సింలు

సీఎం ప్రథమారాధన..:మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రధానాలయంలోకి అందరూ.. ప్రదక్షిణగా వెళ్లారు. సీఎం కేసీఆర్​ దంపతులు స్వామివారికి ప్రథమారాధన చేశారు. ఉపాలయాల్లో ప్రతిష్ఠా మూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆరగింపు సేవ చేశారు. తర్వాత తీర్థ, ప్రసాద గోష్టి జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఈ మహాపర్వంలో పాల్గొని స్వామివారిని సేవించుకుని తరించారు.

స్వయంభువున్ని దర్శించుకునేందుకు వేచి ఉన్న భక్తులు

భాగస్వాములకు సన్మానం..: ఒకనాటిగుహాలయం నేడు ఆధ్యాత్మికకళాకాంతులతో అద్భుత దివ్యక్షేత్రంగారూపుదిద్దుకోవటంలో భాగస్వాములైనవారందరినీ ప్రభుత్వం ఘనంగాసన్మానించింది. వాస్తుశిల్పులు,స్థపతులుసహా ఎంతో మంది ఆలయ పునర్నిర్మాణంకోసం నిరంతరం శ్రమించి....ప్రపంచస్థాయిక్షేత్రన్ని రూపుదిద్దారు. ఇందులోప్రధాన భూమిక పోషించిన ఆలయఈవో గీత,యాడాఉపాధ్యక్షుడు కిషన్‌రావు,ఆర్కిటెక్ట్‌ఆనందసాయి,స్థపతిసుందర రాజన్ సహా ఆలయ నిర్మాణభాగస్వాములైన వారందరి(ఆయా శాఖల అధికారులు, శిల్పులు, స్వర్ణ, వడ్రంగి కళాకారులు)ని ముఖ్యమంత్రి కేసీఆర్​,మంత్రులు శాలువాలతో సన్మానించి,అభినందనలుతెలిపారు. వైటీడీఏ వైస్​ ఛైర్మన్​ కిషన్​రావును సీఎం కేసీఆర్​ ప్రత్యేకంగా సన్మానించారు. మహోజ్వలఘట్టానికి కారకుడైన సీఎం కేసీఆర్​ను దేవస్థానం తరఫున యాడా అధికారులు, మంత్రులు ఆత్మీయంగా సత్కరించారు.

సీఎం కేసీఆర్​కు సన్మానం

అనతరం "యాదాద్రి- ది సేక్రెడ్​ ఎబోడ్​".. కాఫీ టేబుల్​ బుక్​ను సీఎం ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్​తో ప్రజాప్రతినిధులంతా ఫొటోలు తీసుకున్న తర్వాత.. యాగశాలలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న బోజనాన్ని స్వీకరించారు. సాయంత్రం ఏడున్నర నుంచి.. శాంతి కళ్యాణం, ఆచార్య, రుత్విక్ సన్మానం, మహదాశీర్వాదం, పరిసమాప్తి ఉంటుంది.

ఇదీ చూడండి:

Last Updated : Mar 28, 2022, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details