కరోనా నేపథ్యంలో నిలిపివేసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం, దేవాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం నేటి నుంచి బాలాలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఎత్తివేయడంతో దేవాదాయ శాఖ మౌఖిక ఆదేశాలతో స్వామి వారి దర్శనాలు, మొక్కు పూజలు, ఆర్జిత సేవల్లో పాల్గొనడానికి భక్తులను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులందరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. విధిగా మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు.
యాదాద్రికి సీఎం
యాదాద్రిని మహాదివ్య పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం కేసీఆర్ మరోసారి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆలయ పరిసరాల్లో పర్యటించనున్నారు. సుమారు నాలుగు గంటల పాటు నారసింహుని సన్నిధిలో గడపనున్నారు. కొండపైన ఆలయ పునర్నిర్మాణం, రథశాల, దర్శన వరుసలు, విష్ణు పుష్కరిణి పనులపై ఆరా తీయనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో అతిథి గృహంలో సమీక్షించనున్నారు.