Sravanthi on munugode bypoll defeat: తెరాస, భాజపా కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎన్నిక ఇది అని మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తెలిపారు. మునుగోడులో భాజపా కోవర్టు రాజకీయాలు చేసిందని పరోక్షంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికలో మద్యం ఏరులై పారిందని వాపోయారు. ఫొటో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఎంతో అనైతికమన్నారు. మునుగోడును తెరాస ప్రలోభాలతో గెలుచుకొందని పేర్కొన్నారు. ఈ ఉపఎన్నికలో తెరాస, భాజపా దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. ప్రజల కోసం జరిగిన ఎన్నికైతే ఇది కాదు అని తెలిపారు.
తమ మధ్యనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తులపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామని పాల్వాయి స్రవంతి తెలిపారు. త్వరలోనే వారిపై విచారణ జరుగుతుందని హెచ్చరించారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ముమ్మరంగా కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడు నియోజకవర్గం మొత్తం దాదాపు ప్రచారం చేయడం జరిగిందని ఆమె తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్తించానని, ఒక ఆడబిడ్డనైనా ప్రతి వాడవాడకు తిరిగి ప్రచారం చేశానని.. అయితే తాను ప్రజాబలంతో పోటీ చేస్తే తెరాస, భాజపా అభ్యర్థులు ధనం, అధికారంతో ప్రచారం సాగించారని ఆరోపించారు.