Munugode bypoll: సాధారణంగా పుట్టినరోజు, పెళ్లిరోజు, మరేదైనా ప్రత్యేకమైన రోజు ఉంటేనే దావత్ లు ఏర్పాటు చేస్తారు. మునుగోడులో ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి విందులు కొనసాగుతున్నాయి. రోజూ కార్యకర్తలకు ప్రధాన పార్టీలు కులసంఘాల వారీగా విందులు ఏర్పాటుచేస్తున్నాయి. నాటుకోడి, మేక మాంసం వండి ప్రేమగా వడ్డివార్చుతున్నారు. ప్రచారానికి వస్తున్న నేతలంతా నాటుకోళ్లే కావాలనడంతో స్థానిక నాయకులు వాటిని సమకూర్చడం కోసం నానాతంటాలు పడుతున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల మునుగోడు ప్రాంతంలో నాటుకోళ్లు దొరకడంలేదు. గత్యంతరం లేక ద్వితీయశ్రేణి నేతలకు బాయిలర్ కోడితో సర్దిపెడుతున్నారు.
ప్రధాన పార్టీలన్నీ సామాజిక వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటుచేస్తున్నాయి. ఆత్మీయ సమ్మేళనంలో ఆయాకుల సంఘాల నేతలు కోరిన గొంతెమ్మ కోర్కెలను తీర్చుతామనే హామీలను నేతలు కుమ్మరిస్తున్నారు. ఆయా కులసంఘాల నేతలకు నమ్మకం కుదిరేందుకు కొంత మొత్తం అడ్వాన్స్‌గా ఆయా పార్టీలు చెల్లిస్తున్నాయి. మిగిలిన మొత్తాన్ని ఇంచార్జ్ ముఖ్య నేతలుగా ఉన్న మంత్రుల ఖాతాల్లోంచి చెల్లిస్తామని నమ్మకంగా చెబుతున్నాయి. తమ గ్రామంలో గుడి,బడి కట్టించాలని,రోడ్లు వేయించాలని, విద్య,వైద్య సౌకర్యాలను కల్పించాలని, కల్వర్టులు, చిన్నపాటి వంతెనలను నిర్మించాలని ఆయా కులసంఘాల నేతలు ప్రధానపార్టీలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు కొన్ని కులసంఘాలు అంగీకార పత్రాన్ని రాయించుకుంటున్నాయి.