మూడేేళ్ల క్రితం తెలంగాణలో మియావాకీ విధానంలో మొదటగా పెంచిన వనం నేడు చిట్టడవిని తలపిస్తూ సత్ఫలితాలిస్తోంది. 2018-19లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ అటవీక్షేత్రం పరిధి లక్కారంలో ‘తంగేడువనం’ పేరిట అటవీశాఖ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎకరంలో నాలుగు వేలకు పైగా మొక్కలు నాటారు.
Tangedu Vanam: ఆ స్ఫూర్తితోనే ప్రతి గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం - yadadri Tangedu Vanam
మనసుకు ఉత్తేజాన్నిచ్చేలా పర్యావరణహిత వాతావరణానికి వేదికగా నిలుస్తోంది.. చౌటుప్పల్ వద్ద ఏర్పాటు చేసిన తంగేడువనం. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అనుక్షణం వినిపించే రణగొణధ్వనుల నుంచి ఉపశమనం కలిగిస్తూ ఆహ్లాదకర వాతావరణం అందిస్తోంది.
![Tangedu Vanam: ఆ స్ఫూర్తితోనే ప్రతి గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం yadadri Tangedu Vanam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13078507-thumbnail-3x2-kee.jpg)
గతంలో ఈ ప్రదేశం రాళ్లు రప్పలతో ఉండేది. నిస్సారమైన ఈ నేలను రెండు అడుగుల లోతు తవ్వి ‘సుపోషకం’ చేశారు. స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకుని పెరిగే మొక్కలు ఎంపిక చేసి నాటారు. వారానికోసారి నీటి తడులిచ్చారు. ఈ మొక్కలు ఏపుగా పెరగడంతో జాతీయ రహదారి పక్కనే ఈ ప్రదేశం ఇప్పుడు చిట్టడవిలా మారింది. సందర్శకులు ఇందులో సేద తీరడానికి చక్కగా కర్రలతో ఓ గుడిసె నిర్మాణం చేశారు. ఈ వనం సీఎం దృష్టికి వెళ్లడంతో ఆయన దీనికి ‘యాదాద్రి మోడల్’ పార్కుగా నామకరణం చేసి రాష్ట్రమంతటా ఇలాంటి ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చారు. ఆ స్ఫూర్తితోనే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటవుతోంది. ఎకరం విస్తీర్ణంలో చిట్టడవి పెంచేందుకు రూ.2.50 లక్షలు ఖర్చు చేసినట్లు అటవీశాఖాధికారులు తెలిపారు. దీన్ని పరిశీలించేందుకు దేశం నలుమూలల నుంచి వివిధ శాఖల అధికారులు లక్కారం వస్తున్నారు.
ఇదీ చూడండి: భిన్న వాతావరణానికి ప్రతీక.. ఈ తంగేడు వనం