గత నెల 13న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించిన తర్వాత... యాదాద్రి క్షేత్ర పునర్నిర్మాణాల్లో వేగం పెరిగింది. వచ్చే బ్రహ్మోత్సవాల కల్లా భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలన్న లక్ష్యంతో... తుది దశ పనులు కొనసాగుతున్నాయి. కొవిడ్ విజృంభణతో కొద్దిరోజుల పాటు అంతరాయం కలిగినా... తదనంతర కాలంలో పనులు పుంజుకున్నాయి. ప్రధాన ఆలయం వద్ద బాహ్య ప్రాకారాల్లోని సాలహారాల్లో... విగ్రహాలను ప్రతిష్ఠించే కార్యక్రమం చేపట్టనున్నారు.
సర్వం… సుందరం…నిర్మాణ శోభితంగా యాదాద్రి క్షేత్రం..!! యాదాద్రి శోభితం...
నారసింహ రూపాలు, అష్టలక్ష్మీ అవతారాలు, ఆళ్వారుల విగ్రహాలు... సాలహారాల్లో దర్శనమివ్వనున్నాయి. మొత్తం 130 వరకు గల సాలహారాల్లో... స్వామి, అమ్మవార్ల అవతార మూర్తులను ప్రతిష్ఠిస్తారు. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రథమ ప్రాకారంలోని నాలుగు దిక్కుల ద్వారాలకు... వెండి తొడుగులు అమర్చే యోచనలో యాదాద్రి ఆలయ ప్రాధికార సంస్థ యాడా ఉంది. పంచతల రాజగోపురం, త్రితల రాజగోపురంతో పాటు ప్రాకారంలోని మరో రెండు ద్వారాలు సైతం... రజత శోభితంగా కనువిందు చేసే అవకాశముంది. మొత్తంగా గర్భగుడి ద్వారాలు స్వర్ణంతో, ప్రథమ ప్రాకారంలోని తలుపులు వెండితో, ప్రధాన రాజగోపురాల ద్వారాలు ఇత్తడి తొడుగులతో రూపుదిద్దుకోనున్నట్లు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.
సర్వం… సుందరం…నిర్మాణ శోభితంగా యాదాద్రి క్షేత్రం..!! అద్భుత శిల్పకళ
గర్భాలయ ముఖద్వారంపై... ప్రహ్లాదుని చరిత్రను పొందుపరిచే ప్రక్రియ పూర్తయింది. ప్రహ్లాదుని జననం నుంచి పట్టాభిషేకం వరకు జరిగిన పరిణామాలు... ముఖద్వారంపై భక్తులకు కనువిందు చేయబోతున్నాయి. గర్భగుడి తలుపుల బంగారు తాపడాన్ని చెన్నైకి చెందిన స్మార్ట్ క్రియేషన్ సంస్థ నిర్వహిస్తుండగా... వాటిని ఇక్కడకు తీసుకురావాల్సి ఉంది. స్వర్ణ తాపడ ద్వారాలతో పాటు పుష్పాలు, దేవతామూర్తులు సైతం... చెన్నై నుంచి యాదాద్రికి రానున్నాయి. పూర్తిగా కృష్ణశిలలతో 4.03 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న పంచనారసింహుల ప్రాంగణం... భక్తులను తన్మయత్వంలో ముంచెత్తేందుకు సిద్ధమవుతోంది. గర్భాలయ ద్వారాలు, యాగశాల, రామానుజ కూటమి, ధ్వజస్తంభ బలిపీఠం, మహాముఖ మండపం వంటివి పూర్తయ్యాయి. అనుబంధ ఆలయాల్లోనూ ప్రధాన కట్టడాలు తుది దశకు చేరాయి.
సర్వం… సుందరం…నిర్మాణ శోభితంగా యాదాద్రి క్షేత్రం..!! బంగారు తాపడం
బంగారు తాపడంతో కూడిన ద్వారాలపై శిల్పాలను చెక్కేందుకు, పెంబర్తి కళాకారుల్ని సంప్రదించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనతో... వారితోనూ అధికారులు చర్చలు జరిపారు. ఇప్పటికే రెండు సార్లు యాదాద్రిలో పర్యటించిన పెంబర్తి శిల్పులు... యాడా నిర్వాహకులతో మాట్లాడారు. శిల్పాలు చెక్కేందుకు అయ్యే వ్యయానికి సంబంధించి అంచనాల్ని నివేదిక రూపంలో అందజేయాలని... వారికి యాడా సూచించింది. శిల్పుల నుంచి నివేదిక అందిన తర్వాత పనులు అప్పగించాలన్న యోచనలో ఆలయ వర్గాలున్నాయి.
సర్వం… సుందరం…నిర్మాణ శోభితంగా యాదాద్రి క్షేత్రం..!! అంతరాలయంలో ఫ్లోరింగ్ పూర్తి కాగా... శుద్ధీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఆళ్వార్ల విగ్రహాల ప్రాంతంలోనూ... శుద్ధి చేపడుతున్నారు. వర్షాలతో గర్భగుడిలోకి నీరు చేరి ఇంతకుముందే వివాదాస్పదం కావడంతో... అందుకు సంబంధించిన మరమ్మతులు పూర్తి చేశారు. నీరు లీకైన ప్రాంతంలోని రాళ్లను తీసి... వాటి మధ్యలో సున్నంతో కూడిన పదార్థాన్ని పూశారు. పది రోజుల పాటు పరీక్షించిన తర్వాత... లోపం సవరించామన్న నిర్ధరణకు వచ్చారు. మొత్తంగా ముఖ్యమంత్రి పర్యటనతో యాదాద్రి ఆలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది.