భువనగిరి కోటను రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉంది. దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే.. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి అంతర్జాలంలో చూసి.. ప్రత్యేకంగా చూసేందుకు వస్తున్నారు. కోట అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం గతంలో 16.50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు మాత్రం విడుదల కాలేదు. ఈ అంచనా వ్యయంతో రెస్టారెంట్, మరుగుదొడ్లు, చిన్నారుల కోసం పార్కులు, పాత్ వేలు నిర్మించాలని ప్రతిపాదించారు.
దాదాపు 95వేల ఆదాయం
భువనగిరి కోట నిర్వాహణ కోసం పూర్తి స్థాయి సిబ్బందిని నియమించలేదు. ఉన్న ఒక్క చౌకీదార్ వీఆర్ఎస్ తీసుకోవడంతో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్లు మాత్రమే మిగిలారు. వీరు కూడా ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించారు. వీరే సందర్శకులకు టికెట్లు ఇస్తున్నారు. వీరికి ఐదు నెలల నుంచి జీతాలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల కోట సందర్శించే పర్యాటకుల నుంచి నెలకు దాదాపు 40వేల రూపాయల నుంచి 95వేల ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది.
కోట వద్ద రోప్‌వే
భువనగిరి కోట వద్ద 2013లో తీగ మార్గాన్ని (రోప్‌వే) ప్రతిపాదించారు. నిర్మాణానికి బైపాస్ రోడ్డు సమీపంలో 2.36 ఎకరాల భూమిని సేకరించి.. అక్కడ బేస్ స్టేషన్ ఏర్పాటు కోసం.. కంచెను ఏర్పాటు చేశారు. తదుపరి అవసరాల కోసం మరో రెండు ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. తీగ మార్గం నిర్మాణం చేపట్టేందుకు గతంలో కోల్‌కత్తాకు చెందిన రోప్ వే రిసార్ట్ అనే సంస్థ ముందుకు వచ్చింది. అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదించింది.