యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం వైభవంగా పూజలు జరిపారు. వేకువ జామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయంలోని కవచమూర్తులను వేద మంత్ర పఠనాల నడుమ అభిషేకించి... తులసి దళాలు, కుంకుమలతో అర్చనలు చేశారు. హోమం, నిత్య తిరు కల్యాణోత్సవం వేడుకలు చేపట్టారు. పాత గుట్టలో నిత్య కైంకర్యాలు కొనసాగాయి.
రోజుకు ఆరు బ్యాచ్‌లు
కార్తీక మాసం కోసం యాదాద్రి పుణ్యక్షేత్రం ముస్తాబైంది. సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొననున్నందున రేపటి నుంచి కార్తీక మాసం ముగిసేవరకు రోజుకు ఆరు బ్యాచ్‌ల చొప్పున వ్రతాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్తీక పౌర్ణమి రోజున ఎనిమిది బ్యాచ్‌లలో వ్రతాలు నిర్వహించనున్నారు.
వ్రత పీటల ఏర్పాటు
కొవిడ్ కారణంగా ఒక్కో బ్యాచ్‌లో 100 మంది భక్తులను మాత్రమే మండపంలోకి అనుమతించనున్నట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. మండపంలో వ్రత పీటలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా వ్రత టికెట్ కొన్న వారికి వ్రతసామాగ్రి నేరుగా పీటల వద్దే ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా సత్యనారాయణ వ్రత మండపాలు కూల్చివేసిన నేపథ్యంలో ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్ కోసం నిర్మించిన భవనంలో వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
ఆదివారం తగ్గిన సందడి
ఆలయంలో భక్తుల రద్దీ ఆదివారం సాధారణంగా ఉంది. స్వామివారికి దర్శనానికి అరగంట సమయం పడుతోంది. దర్శన క్యూ లైన్, ప్రసాదాల కౌంటర్, కళ్యాణ కట్ట, సత్యనారాయణ వ్రత పూజలు, ఘాట్ రోడ్‌లో సందడి తక్కువగానే ఉంది. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ అనంతరం ఆలయంలోకి అనుమతిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఆలయ అభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలు అనుమతించడం లేదు.
ఇదీ చదవండి:నరసింహ స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు