Soil for is our soul:యువతకు వ్యవసాయ ప్రయోజనాలు. దాని ప్రాముఖ్యతను తెలిపేందుకు కృషి చేస్తోన్న సాయిల్ ఫర్ ఈజ్ అవర్ సోల్ సంస్థ. ఇందుకు గాను యాదాద్రి భువనగిరి జిల్లా నాగినేనిపల్లిలో 18 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ నేటితరం యువతకు వ్యవసాయం అవగాహన కల్పిస్తోంది. వ్యవసాయ ప్రయోజనాలను విద్యార్థులకు క్షేత్రస్థాయిలో తెలిపేందుకై తాజాగా వ్యవసాయ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించింది.
farm festival in naginenipally: వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ఫాం ఫెస్ట్... నేచురల్ ఫామింగ్ ఎడ్యుకేషనల్ ట్రిప్ సందడిగా సాగింది. హైదరాబాద్ ఆధారిత "మై డ్రీం - గ్రీన్ హోం" అంకుర కేంద్రం సహకారంతో వ్యవసాయం, వరి నాటు వేయడం, సంప్రదాయ ఆహారంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సమీకృత వ్యవసాయంలో వరి సహా అదనపు ఆదాయం ఇచ్చే అరటి వంటి పండ్ల తోటలు, అపారాలు, జొన్న, కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేశారు.
''వ్యవసాయ పండుగను నిర్వహించడం జరిగింది. ఈ పండుగలో చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు. రైతుల కష్టాన్ని గుర్తించడం గురించి.. పిల్లలకు చెబుతున్నాం. జంక్ ఫుడ్ వద్దు.. సేంద్రియ ఫుడ్ గురించి పిల్లలకు చెబుతున్నాం..'' -రాకేష్ నగునూరి, భాగస్వామి, సాయిల్ ఈజ్ అవర్ సోల్ సంస్థ
కాంక్రీట్ జంగిల్‌కే పరిమితపోయిన విద్యార్థులు ఈ చక్కటి ఆహ్లాదకర వాతావరణం నడుమ పల్లె ప్రకృతి ఆస్వాదించారు. ఎటు చూసిన పచ్చదనం, పంట పొలాలు, రైతుల తమ పనులు చేసుకోవడం, వరి నారు, మడులు, నీరు, బురద చూసి పిల్లలు కేరింతలు కొడుతూ చిందులు వేశారు. పొలం మడిలో నృత్యాలు చేశారు. బురదలో వాలీబాల్, రోప్ గేమ్, కబడ్డీ, ఇతర ఆటలు ఆడారు. కొందరైతే ఏకంగా మడ్ బాత్ చేసి పరవశించిపోయారు.
సాధారణంగా నేటితరం విద్యార్థులకు వ్యవసాయం, పంటల సాగు, విత్తనాలు, నాట్లు, విత్తనం విత్తడం, మొక్కలు ఎలా పెరుగుతాయి.? రోజూ తీసుకునే అల్పాహారం, భోజనం, పాలు వంటి ఎలా వస్తాయో కూడా వారికి తెలియదు. ఈ నేపథ్యంలో పర్యావరణం, భూగర్భ జలాలు, సాగు, తాగునీటి ప్రాధాన్యత, పంటకోతలు, నూర్పడి, శుద్ధి,నిల్వ, మార్కెటింగ్ వంటి అంశాలు స్వయంగా తెలుసుకోగలిగామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.