sivalayam in yadadri: యాదాద్రి పుణ్యక్షేత్రంలో పునరుద్ధరించిన పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటన దిశలో యాడా అధికారులు ముందుకు వెళ్తున్నారు. తెలుగు సంవత్సరం రోజైన ఉగాది పూర్తయ్యాక ఉద్ఘాటన పర్వాన్ని చేపట్టనున్నట్ల ఆలయ నిర్వాహకులు ఈవో గీత, ధర్మకర్త నరసింహమూర్తి వ్యాఖ్యలను పట్టి అర్థమవుతోంది.
సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో చేపట్టిన పంచ నరసింహుల ఆలయంతోపాటు అనుబంధ శివాలయ విస్తరణతో కూడిన పునర్నిర్మాణ పనలు చేపట్టారు. ప్రధానాలయంతో పాటు శివాలయం పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఆలయాల ఉద్ఘాటన పర్వాలలో ప్రధానాలయ సంప్రోక్షణ పర్వాన్ని ఇప్పటికే త్రిదండి చిన జీయర్ స్వామి ఖరారు చేశారు.
శివాలయ పునర్నిర్మాణ పనుల్లో ఆది నుంచి సలహాలు ఇస్తున్న రాంపూర్ ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిజీని అధికారులు ఈ మధ్యనే కలిశారు. పునర్నిర్మితమైన శివాలయంలోని పార్వతీపరమేశ్వరుల నిజరూప దర్శనాలకు కల్పించే యోచనతో ఉద్ఘాటన ముహూర్తాన్ని ఖరారు చేయాలంటూ అభ్యర్థించారు. దీంతో ఉగాది తర్వాత ఏప్రిల్ 25న ముహూర్తం బాగుందని స్వామిజీ చెప్పినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆలయ ఈవో గీత అన్నారు. ఆ తర్వాతే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.