Smoke in Secunderabad Sirpur Kagaznagar Train :సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలులో (Secunderabad Sirpur Kagaznagar Train)పొగలు వ్యాపించాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై వెంటనే చైన్ లాగి రైలును ఆపివేశారు. భయంతో ట్రైన్ నుంచి బయటకు పరుగులు తీశారు.
దీంతో అప్రమత్తమైన లోకో పైలట్ రైలును బీబీనగర్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. ట్రైన్ ఇంజిన్ బ్రేక్ లైనర్లు బలంగా పట్టేయడంతో పొగలు వ్యాపించినట్లు రైల్వే సిబ్బంది నిర్ధారించారు. వెంటనే వారు మరమ్మతులు చేశారు. అనంతరం అక్కడి నుంచి రైలు బయల్దేరింది. ఈ ఘటనలో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవలే సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్లో పొగలు వ్యాపించాయి. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ వద్దకు రాగానే రైలు నుంచి దట్టమైన పొగలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. అప్పటికే ట్రైన్, స్టేషన్ వద్ద నిలిపి ఉంచడంతో భయంతో అందులో నుంచి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. ట్రైన్‌లో పొగలు రావడానికి ప్రధాన కారణం బ్రేక్ వద్ద పైపులని గుర్తించి మరమ్మతులు చేశారు.