యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల.. మందుబాబులకు నిలయంగా మారింది. సాయంత్రం కాగానే మందుబాబులు అక్కడికి చేరుతున్నారు. కొవిడ్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో పక్కనే ఉన్న నివాసితులు భయాందోళన చెందుతున్నారు. తరగతి గదుల తలుపులు విరగ్గొట్టి మద్యం సేవించడమే కాకుండా.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటి ద్వారా విద్యార్థులు కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటివి పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నిర్వహణాలేమి
మరోవైపు పాఠశాలల పాత గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయని, మరమ్మతు చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. యాదగిరిగుట్టతో పాటు, బొమ్మల రామారం, తుర్కపల్లి, మోటకొండూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఇలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. పాఠశాలల ఆవరణల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అంతే కాకుండా నిర్వహణాలేమితో దుర్గంధం వెదజల్లుతోందని.. దీని ద్వారా పిల్లలు అనారోగ్యానికి గురయ్యే ఆస్కారముందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలావస్థకు చేరినట్లుగా ఉన్న తరగతి గదులు, పగిలిన ఫ్లోరింగ్ బండలు విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపెడుతున్నాయి. పాఠశాలల ఆవరణల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, ఆకతాయిల చేష్టలకు తెగిన విద్యుత్ కనెక్షన్లు భయాందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో పారిశుద్ధ్య, మరమ్మతు చర్యలపై జిల్లా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
యాదగిరి గుట్టలోని ప్రభుత్వ పాఠశాలలో మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. తరగతి గదుల్లోకి చేరి మద్యం సేవిస్తున్నారు. అంతే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థులు చెడు వ్యసనాల బారిన పడే అవకాశం ఉంది. విద్యాశాఖ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలి. -స్థానికుడు, యాదగిరి గుట్ట