ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నవన్నీ మారుమూల గిరిజన తండాలు, పల్లెలే. ఒకప్పుడు అక్కడి తండాల్లో గుడుంబా వాసన గుప్పుమనేది, రాచకొండ గుట్టలకు ఆనుకుని ఉన్న ప్రాంతం కావడం వల్ల మావోయిస్టుల ప్రాబల్యం కూడా అధికంగానే ఉండేది. గొడవలు, కొట్లాటలూ ఎక్కువగానే ఉండేవి. ప్రస్తుతం రాచకొండ పోలీసులు అవలంభిస్తున్న విధానాలు సత్ఫలితాలను అందించాయి. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ డివిజన్ సంస్థన్ నారాయణపురం ఠాణా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో 14వ స్థానం దక్కించుకుంది.
'గుడుంబా తయారీకి అడ్డుకట్టనే సత్ఫలితాలను ఇచ్చింది'
ఈ ఠాణాలో అడుగు పెట్టగానే చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంత వాతావరణం ఆహ్లాదాన్ని పంచుతాయి. గిరిజన తండాలు ఎక్కువగా ఉండే ఈ మండలంలో గుడుంబా తయారీ అధికంగా ఉండేది. స్థానిక పోలీసులు గ్రామాలు, తండాల్లో గుడుంబాకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి తయారీకి అడ్డుకట్ట వేశారు. ప్రతీ వారం గ్రామాల్లో కార్డన్ సెర్చ్‌లు నిర్వహించి అసాంఘిక శక్తుల ఆటకట్టించారు.
'ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలే ఈ ర్యాంకుకు కారణం'
మహిళలు ధైర్యంగా వచ్చి పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటానికి మహిళా కానిస్టేబుల్‌ను నియమించి పలు గ్రామాలను దత్తత తీసుకున్నామని ఠాణా ఎస్సై నాగరాజు తెలిపారు. తమ ఠాణాకు దేశంలో 14వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని.. అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు.
ప్రజా సంబంధాలు మెరుగుపర్చడం, సాంకేతిక పరిజ్ఞాన సాయంతో నేర నియంత్రణ, భద్రత, నిఘా పటిష్ఠత వంటి అంశాలపై దృష్టి సారించడం వల్లే ఈ అరుదైన గౌరవం లభించిందని చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్య స్పష్టం చేశారు.
కేంద్రం విడుదల చేసిన ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాలో రాష్ట్రం నుంచి రెండు ఠాణాలు ఎంపిక కాగా నారాయణపురం పోలీస్ స్టేషన్ 14వ స్థానం దక్కించుకుంది. నల్గొండ జిల్లా చింతపల్లి ఠాణా 24వ ర్యాంకు సాధించింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రెండు ఠాణాలు జాబితాలో చోటు దక్కించుకోవడం వల్ల జిల్లా పేరు మార్మోగుతోంది.
'దేశంలోనే 14వ ఉత్తమ ఠాణాగా సంస్థాన్ నారాయణపురం' - SI RAJU
రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్‌కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని ఉత్తమ ఠాణాల జాబితాలో 14 వ ర్యాంకు సాధించి ఘన కీర్తి సొంతం చేసుకుంది.
దేశవ్యాప్త 14వ ఉత్తమ ఠాణాగా సంస్థన్ నారాయణపురం
ఇవీ చూడండి : బాలాకోట్ దాడుల వ్యూహకర్తకు 'రా' బాధ్యతలు