యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునర్నిర్మాణంలో ఉన్నందున ఈవో గీతారెడ్డి అనుమతి లేకుండా ప్రధానాలయంలోకి ఎవరూ వెళ్లకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కానీ దేవాలయంలో ఏఈవోగా పనిచేసి పదోన్నతిపై వెళ్లిన ఓ ఉద్యోగి అనుమతి లేకుండా స్వామికి ఆరగింపు చేసిన సమయంలో ఆలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనుమతి లేకుండా ఆలయంలో ఉద్యోగి వెళ్లడంపై ఈవోను ప్రశ్నించగా.. అందులో తప్పేముంది అంటూ సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా గతంలో ఆలయంలో పనిచేసే ఉద్యోగులు.. ఆలయంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారని వారికి ఈవో షోకాజ్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.
యాదాద్రి ఆలయంలో నిబంధనల ఉల్లంఘన.. వంతపాడుతున్న ఈవో
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ప్రధానాలయంలోకి అనుమతి లేకుండా వెళ్లకూడదనే నిబంధనను గాలికొదిలేశారు. స్వామి వారికి ఆరగింపు చేసే సమయంలో.. గతంలో పనిచేసిన ఓ ఉద్యోగి గర్భాలయంలోకి వెళ్లారు. కేవలం నలుగురికే అనుమతులున్న సమయంలో ఉద్యోగి వెళ్లడం.. ఆ విషయమై ఈవో స్పందించకపోవడం వల్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వామివారి నివేదన సమయంలో ఇద్దరు ఆచార్యులు, ఆలయ సూపరింటెండెంట్ సిబ్బంది ఇద్దరు తప్ప ఐదో వ్యక్తికి అనుమతి లేదు. మరి అదే సమయంలో ఇటీవల యాదాద్రి ఏఈవోగా చేసి అసిస్టెంట్ కమిషనర్గా పదోన్నతి పొందిన సదరు అధికారి, మరో వ్యక్తి కలిసి ప్రధానాలయంలోకి ఎలా ప్రవేశించారని స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఈవో గీతారెడ్డిని వివరణ కోరగా.. అతను అసిస్టెంట్ కమిషనరే కదా.. తప్పేముంది అంటూ సమాధానమిచ్చారు. గత కొన్ని రోజులుగా మీడియాను ప్రధానాలయం వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
ఇదీ చూడండి:తెలంగాణలో కొత్తగా 1,473 కరోనా కేసులు.. 8 మంది మృతి