గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని పాలకులు చెబుతున్న మాటలు ఆచరణలో కనిపించడం లేదంటున్నారు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామస్థులు. గ్రామంలో రహదారి సౌకర్యం(road problems in villages) సరిగాలేక నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. రోడ్డుపై అడుగడుగునా ఏర్పడిన గుంతలతో నిత్యం నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులు బాగు చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నాయే తప్ప... పాలకుల్లో మాత్రం స్పందన కరవైందని అంటున్నారు. వెంటనే రోడ్డు సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
ప్రయాణికుల అవస్థలు
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామం. ఈ గ్రామ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవాలయానికి అతిదగ్గరగా ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి వంగపల్లి గ్రామానికి వెళ్లే మార్గం మధ్య నుంచి ఈ గ్రామంతో పాటు నియోజకవర్గ కేంద్రమైన ఆలేరుకు వెళ్లేందుకు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి మార్గం కలిగిన గ్రామం. వరంగల్ వైపు నుంచి యాదాద్రి పుణ్యక్షేత్రానికి వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై నుంచి రావడానికి దగ్గరి మార్గం ఈ గ్రామం నుంచే ఉంటుంది. కానీ పెద్దకందుకూరు నుంచి యాదాద్రి వరకు రోడ్డు పూర్తిగా గుంతలమయం(road problems in villages) కావడంతో ఆ రోడ్డు మీదుగా వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రమాదాలకు అవకాశం
యాదాద్రి పుణ్యక్షేత్రానికి దాదాపు మూడు గ్రామాల ప్రజలు, వరంగల్ నుంచి యాదాద్రికి వెళ్లే భక్తులతో పాటు గ్రామ సమీపంలోని రెండు, మూడు కంపెనీలకు వెళ్లే కార్మికులు దాదాపుగా పెద్దకందుకూరు గ్రామం నుంచే వెళ్తారని సర్పంచ్ తెలిపారు. గ్రామంలోని రోడ్డు గుంతలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు(road problems in villages) పడుతున్నారని అంటున్నారు. ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... మరమ్మతులు చేపట్టడంలేదని పేర్కొన్నారు. రాత్రివేళ ప్రయాణాల్లో ఎన్నో ప్రమదాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి... రహదారులను బాగు చేయాలని సర్పంచ్ విజ్ఞప్తి చేస్తున్నారు.
తప్పని తిప్పలు
పెద్దకందుకూరు గ్రామం నుంచి యాదగిరిగుట్ట రోడ్డు వరకు రహదారి గుంతలమయం కావడంతో... ఈ రోడ్డు గుండా వెళ్లాలంటేనే భయపడాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో ఈ దారిగుండానే మండల కేంద్రమైన యాదగిరిగుట్టకు నిత్యం రాకపోకలు సాగిస్తామని తెలిపారు. గుంతల రోడ్లతో నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు.