కొవిడ్ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు హంగుఆర్భాటాలు లేకుండా జరిగాయి. కలెక్టర్ అనితా రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గల్వాన్ లోయలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కర్నల్ సంతోష్ కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం 'మహావీర చక్ర' ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి శిక్షణా కలెక్టర్ సంతోషిని కలెక్టర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కలిసి శాలువాతో సత్కరించారు.
'కేంద్ర ప్రభుత్వం నా భర్త సంతోష్ కుమార్‌కు అవార్డు ప్రకటించడం గర్వంగా ఉంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆయన అందరికీ ప్రేరణగా ఉంటారు. నా పిల్లలు వారి నాన్నను చూసి గర్విస్తున్నారు.'
సంతోషి, కల్నల్ సంతోష్‌కుమార్ భార్య
కర్నల్ సంతోష్‌కుమార్ భార్యకు కలెక్టరేట్లో సన్మానం తెలంగాణ ప్రభుత్వానికి సంతోషి కృతజ్ఞతలు తెలిపారు. మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. రాజ్యాంగ రచనకు ఎంతోమంది కృషి చేశారని కలెక్టర్ అనితా రామచంద్రన్ కొనియాడారు. కొవిడ్ విపత్కర సమయాల్లో జిల్లా వైద్యబృందం బాగా పని చేసిందని చెప్పి వారి సేవలను ప్రశంసించారు. దాతలు కూడా ముందుకు వచ్చి వారి వంతుగా తోచిన సాయం చేశారని పేర్కొన్నారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. కర్నల్ సంతోష్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం మహావీర చక్ర ప్రకటించడం గర్వంగా ఉందని కలెక్టర్ అనిత వెల్లడించారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆమె ఆకాక్షించారు.
వేడుకల్లో పోలీసు కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జిల్లాలో ఉత్తమ ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. కొవిడ్ నేపథ్యంలో ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలు, వక్తల ఉపన్యాసాలు లేకుండా వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కనీవినీ ఎరుగని పథకాలతో.. దేశంలో అగ్రగామిగా తెలంగాణ