సరుకులు రవాణా చేసే వాహన చోదకులకు తమవంతు సాయంగా ఆహార పొట్లాలను అందిస్తున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద లారీల డ్రైవర్లకు భోజన ప్యాకెట్స్‌ని సీపీ అందించారు. డీజీపీ మహేందర్ రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని తెలిపారు. బీబీనగర్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద లారీ డ్రైవర్లకు మధ్యాహ్నం, రాత్రి పోలీస్ శాఖ తరఫున ఆహారం అందిస్తామని... ట్రక్ డ్రైవర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సీపీ సూచించారు.
డ్రైవర్లకు ఆహార పొట్లాలు పంచిన మహేశ్ భగవత్ - CP Mahesh Bhagawath Food Distribution
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద లారీ డ్రైవర్లకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. లాక్‌డౌన్ వల్ల హోటళ్లు, దాబాలు మూసివేసినందున డ్రైవర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్న డీజీపీ మహేందర్ రెడ్డి సూచనలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు తెలిపారు.
ఆహార పొట్లాలు అందిస్తున్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్
అనంతరం కరోనా నియంత్రణకు బీబీనగర్ టోల్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఆయన తనిఖీ చేశారు. రాచకొండ పరిధిలో ఇప్పటి వరకు 17 మందికి కరోనా పాజిటివ్ రాగా... అందులో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారన్నారు. మిగిలిన వారిలో 8 మంది ఢిల్లీకి వెళ్లొచ్చిన వారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు రెండు వేలకు పైగా వాహనాలు సీజ్ చేసి... కేసులు నమోదు చేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి :ప్రపంచవ్యాప్తంగా 'లక్ష' దాటిన కరోనా మరణాలు