Prostitution gangs in yadadri : యాదాద్రిలో గత కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న వ్యభిచార ముఠాలు.. ఇటీవల మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించాయి. రాచకొండ పోలీసులు ఈ పాపపు కూపం నుంచి ఇద్దరు బాలికలకు విముక్తి కలిగించడంతో దీనిపై మళ్లీ చర్చ మొదలైంది. యాదాద్రిని అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం 2015లో నిర్ణయించింది. దీంతో వ్యభిచార వృత్తిలో ఉన్నవారందరికీ మెరుగైన ప్రత్యామ్నాయాలు కల్పించేందుకు అధికార, పోలీసు వర్గాలు చర్యలు తీసుకున్నాయి. దీంతో గత కొన్నాళ్లుగా యాదాద్రిలో ఇటువంటి కార్యకలాపాలు చోటు చేసుకోలేదు. అయితే స్థానిక పోలీసు, అధికారుల సహకారంతో కొంత మంది దీనిని తిరిగి వ్యవస్థీకృతం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
గతంలోనూ స్థానిక అధికారులు, పోలీసుల అండతోనే యాదాద్రిలో వ్యభిచార ముఠాలు చురుగ్గా పని చేస్తున్నాయని హైకోర్టు వ్యాఖ్యలు చేయడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. యాదాద్రిలోని వ్యభిచార గృహాల్లో చిన్నారులు త్వరగా ఎదిగేందుకు వివిధ హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తున్నారని భువనగిరి షీ-టీం సభ్యులు 2018 జులై 30న చేసిన తనిఖీల్లో బయటపడింది. కానీ దేవాలయ అభివృద్ధిలో భాగంగా.. అప్పటి నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటూ నిత్యం ప్రభుత్వ పెద్దలు ఈ పుణ్యక్షేత్రానికి రాకపోకలు సాగిస్తుండటంతో ఐదారేళ్లుగా ఈ దందా సాగలేదు. ఈ ఏడాది మార్చిలో ఆలయ ఉద్ఘాటన అనంతరం ఉన్నతాధికారుల రాకపోకలు తగ్గాయి. దీంతో పోలీసులు తిరిగి వ్యభిచార ముఠాలతో ఒకటైపోయి ఈ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారన్న విమర్శలు తీవ్రమయ్యాయి. తాజాగా ఇద్దరు బాలికలను చిన్నప్పుడే కొనుగోలు చేసి, ప్రస్తుతం 16 ఏళ్ల లోపున్న ఇద్దరు బాలికలను వ్యభిచార ముఠంలో దింపగా.. అందులో ఒకరు తప్పించుకొని పోలీసులకు సమాచారం రావడంతో వారు ఇక్కడ సాగుతున్న దందాను గుట్టురట్టు చేశారు.