తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రికి మణిహారం... ప్రెసిడెన్షియల్​ సూట్లు - Presidential Suites in yadadri

ముఖ్యమంత్రి పర్యటన తర్వాత యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పనులు వేగం పుంజుకున్నాయి. ప్రధాన ఆలయం, కొండ చుట్టూ రింగ్ రోడ్డుతో పాటు ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణాలు... సకల హంగులతో రూపుదిద్దుకోబోతున్నాయి. దేశంలోనే అద్భుత ఆలయంగా నిలవబోతున్న యాదాద్రికి... ప్రెసిడెన్షియల్ సూట్లు మణిహారంగా నిలవనున్నాయి.

Presidential Suites in yadadri
యాదాద్రికి మణిహారం... ప్రెసిడెన్షియల్​ సూట్లు

By

Published : Dec 27, 2019, 4:53 PM IST

యాదాద్రికి మణిహారం... ప్రెసిడెన్షియల్​ సూట్లు

యాదాద్రికి వచ్చే సామాన్య భక్తుల కోసం ఇప్పటికే ఆలయ నగరి సర్వాంగ సుందరంగా తయారవుతుండగా... క్షేత్రాన్ని సందర్శించే ప్రముఖులకు సైతం అంగరంగ వైభవమన్న రీతిలో ఆతిథ్యం దక్కనుంది. రాష్ట్రపతి, ప్రధాని, వివిధ దేశాధినేతలు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు స్వామి వారిని దర్శించుకునే సమయంలో... వారు బస చేసేందుకు ప్రెసిడెన్షియల్ సూట్లు నిర్మిస్తున్నారు.

దేశాధినేతలు, ప్రముఖులకు మాత్రమే

ప్రధాన కొండకు సమీపంలోని మరో కొండపై... ఈ నిర్మాణాలు వడివడిగా సాగుతున్నాయి. ఈ నెల 17న యాదాద్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి... ఆలయ నిర్మాణాలతో పాటు సూట్ల పనులను పరిశీలించారు. త్వరితగతిన వీటిని పూర్తి చేయాలని ఆదేశించడంతో... భవనాల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. విశ్వక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా... ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణ పనులు నడుస్తున్నాయి. కొండ కింద ఉత్తరాన ప్రత్యేక ప్రాంగణంగా సూట్లను తీర్చిదిద్దుతున్నారు. దాతల విరాళాలు 104 కోట్లతో నిర్మితమయ్యే సూట్లను... దేశాధినేతలు, ప్రముఖులు మాత్రమే వినియోగించనున్నారు.

14విల్లాల నిర్మాణాలు:

కొండపై ఎత్తయిన ప్రదేశంలో ప్రెసిడెన్షియల్ సూట్, కింద 14 విల్లాల నిర్మాణాలు సాగుతున్నాయి. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగుతోంది. వీటిని ఏ విధంగా తీర్చిదిద్దాలనే దానిపై ఇప్పటికే ఆర్కిటెక్టులు ప్రణాళిక తయారు చేశారు. వాటి నమూనాల్ని సైతం ఇప్పటికే అధికారులకు అందజేశారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ యాడా... వీటి నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆధ్యాత్మికతకు, ఆహ్లాదానికి నిలయంగా సూట్లను నిర్మించాలన్న యోచనలో... వైటీడీఏ ఉంది.

కొండలపై అద్భుతరీతిలో నిర్మాణాలు

ఆధారశిల మొదలు శిఖరం వరకు అమూలాగ్రం రాతి శిలలతో నిర్మాణాలవుతుండగా... ప్రధాన కొండకు అనుబంధంగా ఉన్న గుట్టలపై సుందరీకరణతో కూడిన వసతుల సముదాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే పాత గుట్టపై సుందరీకరణ, అంతర్గత రహదారుల పనులు పూర్తి కాగా... భక్తులు బస చేసేందుకు కాటేజీలకు సంబంధించిన భవనాలు నిర్మించాల్సి ఉంది. ఇటు గండి చెరువుకు సమీపంలోని ఇంకో కొండపై... ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణం జరుగుతోంది. ఇలా యాదాద్రిలోని కొండలపై అద్భుత రీతిలో నిర్మాణాలు సాగుతున్నాయి.

రాష్ట్రపతి విడిది కోసం ప్రత్యేక సూట్​

యాదగిరిపల్లి శివారులో 13.26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ప్రెసిడెన్షియల్ సూట్లు... అత్యాధునిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. 7 వేల 5 వందల చదరపు అడుగుల్లో 14 విల్లాలు కొండ కింద నిర్మిస్తుంటే... రాష్ట్రపతి విడిది కోసం కొండపైన 15 వేల చదరపు అడుగుల్లో విశాలమైన రీతిలో సూట్ నిర్మిస్తున్నారు. కొండపైకి చేరుకునేందుకు వీలుగా రహదారి నిర్మాణంతో పాటు... చుట్టూ ఉండే రక్షణ గోడకు సంబంధించిన పనులు తుది దశకు చేరాయి. చిన్న చిన్న రాళ్లను గోడగా పేర్చిన తీరుగా నిర్మాణం సాగింది. కేవలం విదేశాల్లో మాత్రమే ఇలాంటి పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారని... ఇప్పుడు యాదాద్రిలో అలాంటి పరిజ్ఞానం కార్యరూపం దాల్చనుందని అధికారులు అంటున్నారు. ​

గుట్ట చుట్టూ పచ్చదనం

కొండను పూర్తి పచ్చదనంగా మార్చేందుకు... లాండ్ స్కేప్ వనాలు, మినీ గార్డెన్లు, సెల్లార్ సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించే రీతిలో వాల్ పెయింటింగ్ చిత్రాలను వేయనున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ల నుంచి నేరుగా ప్రధాన ఆలయం గల కొండపైకి చేరుకునేందుకు వీలుగా... ప్రత్యేక దారిని రింగ్ రోడ్డుకు అనుసంధానిస్తున్నారు. ఇలా అన్ని హంగులతో నిర్మితమవుతున్న ప్రెసిడెన్షియల్ సూట్... యాదాద్రిలోనే అద్భుత కట్టడంగా నిలిచిపోనుందని భావిస్తున్నారు.

ఇవీ చూడండి:దేశవ్యాప్తంగా 'పౌర' నిరసనలకు వామపక్షాల పిలుపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details