యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. శివలాల్తండాలో 65 క్వింటాళ్ల లోడ్‌తో తరలించడానికి సిద్ధంగా ఉన్న డీసీఎం, టాటాఏస్ వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
ఆగని అక్రమ రేషన్ బియ్యం దందా - ఆలేరులో అక్రమ రేషన్ దందా
పేదప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. పోలీసులు అడపాదడపా దాడులు నిర్వహించి పట్టుకుంటున్నప్పటికి ఫలితంలేకుండా పోతోంది. అక్రమ రేషన్ దందాలో పట్టుబడి అరెస్టు కావడం ఆపై బయటకొచ్చి మళ్లీ తమ దారి తమదే అన్నట్లు అక్రమార్కులు వ్యవహరిస్తున్నారు.
ఆలేరులో ఆగని బియ్యం దందా జోరు..
గతంలో కూడా ఆలేరు పరిసర ప్రాంతాల్లో పలు మార్లు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నప్పటికీ అక్రమార్కులు దందాలను మాత్రం ఆపడం లేదు. కేసులు పెట్టినప్పటికీ పద్ధతి మార్చుకోకుండా యధాతథంగా అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకొని రాత్రి సమయాల్లో రేషన్ బియ్యం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.