Regional Ring Road Dispute latest news : రీజినల్ రింగ్ రోడ్డు అలైన్డ్ మెంట్‌ను మార్చాలని గత నెల 30వ తేదీన కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన రైతులను ఇవాళ పద్నాలుగు రోజుల రిమాండ్ అనంతరం భువనగిరి కోర్టులో హాజరుపరిచారు. అదే రోజు మంత్రి జగదీశ్ రెడ్డి కాన్వాయ్‌ను కలెక్టరేట్ వద్ద రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతుల చేతులకు సంకెళ్లు వేసి ఇవాళ పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. దీనిపై తీవ్రంగా ఆగ్రహించిన బాధిత కుంటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల పట్ల ఇంత క్రూరంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. పద్నాలుగు రోజులుగా వారిని నిర్భందించడమే కాకుండా సంకెళ్లు వేయటం బాధకరమని రైతులు ఆందోళన చేశారు. రిమాండ్‌లో ఉన్న రైతులను ఇవాళ నల్గొండ జిల్లా జైలు నుంచి యాదాద్రి భువనగిరి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. రైతులు వారి కుటుంబీకులను కోర్టు ఆవరణలో కలుసుకోవడంతో కన్నీరు పెట్టుకున్నారు.
- Nitin Gadkari on ORR: ORRకు ఉరి!...రాష్ట్ర అభివృద్దికి విఘాతం
- Telangana Regional Ring Road : భారత్‌మాల-2 ప్రాజెక్టులో తెలంగాణ ఆర్ఆర్ఆర్
ప్రభుత్వం అన్యాయంగా తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా.. బాధిత రైతులకు సోమవారమే బెయిల్ మంజూరు కాగా.. ఇవాళ న్యాయవాదుల పూచీకత్తులు సమర్పించారు. విడుదల కోసం బెయిల్ రిలీజ్ కాపీలను నల్గొండ జైలు అధికారులకు అందించనున్నారు.