యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం చిన్న పలుగుతండాలో ఆగస్టు 23న కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 19 మందిని అదుపులో తీసుకోగా, కోడి పందాలు నిర్వహిస్తున్న ఐదుగురు పరారీలో ఉన్నారు. వారిని ఆగస్టు 27న పోచంపల్లి మండల కేంద్రంలో అదుపులోకి తీసుకున్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. యాంపాల మధుసూదన్ రెడ్డి, మామిళ్ళపల్లి సత్యనారాయణ, బానోతు పాండు, రాంబాబు, మర్రి మల్లేష్ అనే ఐదుగురు కోడి పందాలు నిర్వహిస్తున్నారని డీసీపీ తెలిపారు.
కోడిపందాలపై పోలీసుల దాడి.. అదుపులో 19 మంది! - Yadadri Bhuvanagiri News
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండల పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పక్కా సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. కోడి పందాల నిర్వాహకులపై గతంలో పలుమార్లు కేసులు నమోదు చేసినా.. మళ్లీ పందాలు నిర్వహిస్తున్నట్టు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.
నిందితుల్లో ఒకరు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కావటం గమనార్హం. ఈ దాడుల్లో 32 పందెంకోళ్లు, మరో 10 మృతిచెందిన కోళ్లు, 30 ద్విచక్ర వాహనాలు, 14 కార్లు, రూ 1.51 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిర్వాహకుడు యంపాల మధుసూదన్ రెడ్డిపై గతంలో సైతం పలు కేసులున్నట్టు ఆయన తెలిపారు. కోడి పందాల్లో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఓటీ, బీబీనగర్ పోలీసులను డీసీపీ అభినందించారు.
ఇవీ చూడండి: పారిశ్రామిక పార్కులకు కేంద్ర సహకారం కావాలి: కేటీఆర్