pedal loom machine : చేనేత కార్మికుల శ్రమ భారాన్ని తగ్గించడానికి మగ్గాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆసు యంత్రం చేనేత రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆస్ఫూర్తితో హైదరాబాద్‌కి చెందిన శివకుమార్ అనే యువకుడు పెడల్ ఆపరేటింగ్ యంత్రాన్ని రూపొందించాడు. దీనివల్ల చేనేత కార్మికుల శ్రమ భారం తగ్గి, ఉత్పత్తి పెరుగుతుంది. సాధారణ మగ్గంపై రోజుకు 10 గంటల చొప్పున 6 రోజులు మగ్గం నేస్తే చీర తయారవుతుంది. అదే సాధారణ మగ్గానికి పెడల్ ఆపరేటింగ్ యంత్రం అమర్చితే రోజుకు 8 గంటలు పనిచేసి నాలుగు రోజుల్లోనే చీరను తయారు చేయొచ్చు.
ఇది ఎలా పనిచేస్తుంది..
పెడల్ ఆపరేటింగ్ యంత్రంలో 0.25 హెచ్‌పీ మోటార్ ఉంటుంది. దీన్ని సాధారణ మగ్గానికి అమర్చవచ్చు. మగ్గం నేసే వారు కాళ్లతో పెడల్‌ని తొక్కనవసరం లేకుండానే కరెంటు సాయంతో పెడల్ కిందికి పైకి మారుతూ పింజర, పేట్‌తో పాటు అచ్చులను ఒకే సారి లాగొచ్చు. కరెంటు లేనప్పుడు కూడా పనికి అంతరాయం లేకుండా మిషన్‌కు అమర్చిన చెక్క పెడల్ తో సాధారణ మగ్గం లాగా పనిచేసుకోవచ్చు. మగ్గం నేయటానికి మాములుగా లయబద్ధంగా పెడల్‌ను తొక్కాల్సి వస్తుంది. దీంతో వృద్ధులు, మహిళలు మోకాళ్లు, కీళ్ల నొప్పుల భారిన పడుతుంటారు. ఈ యంత్రం వల్ల వారి ఇబ్బందులకు పరిష్కారము లభిస్తుంది. ముఖ్యంగా వికలాంగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఎవరు రూపొందించారు..
హైదరాబాద్‌కు చెందిన శివ కుమార్ అనే యువకుడు... పల్లె సృజన సంస్థ సహకారంతో జకాత్ మగ్గాలకు అవసరమైన పెడల్ ఆపరేటింగ్ యంత్రాన్ని రూపొందించాడు. దీని గురించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. దాన్ని చూసిన పోచంపల్లి చేనేత కార్మికులు... సాధారణ మగ్గానికి కూడా యంత్రాన్ని రూపొందించాలని కోరారు. వారి విజ్ఞప్తిపై ఇటీవల పెడల్ ఆపరేటింగ్ యంత్రం తయారు చేశారు. దీన్ని మొదటిసారి పోచంపల్లి పట్టణానికి చెందిన దివ్యాంగుడు గొట్టిముక్కుల రమేశ్ మగ్గానికి అమర్చారు. గత వారం పది రోజులుగా రమేశ్... మగ్గంపై యంత్రం ద్వారా విజయవంతంగా చీర నేస్తున్నాడు. దివ్యాంగుడైన రమేశ్.. ఇప్పటి వరకు ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన కృత్రిమ కాళ్ల సాయంతో మగ్గం నేసేవాడు. ఇప్పుడు పెడల్ యంత్రం రావడంతో సులభంగా మగ్గం నేస్తున్నాడు. ఈ యంత్రం సహకారంతో తన కష్టానికి ఓ పరిష్కారం లభించిందని రమేశ్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
పదేళ్ల క్రితం రైలు ప్రమాదంలో రెండు కాళ్లూ కోల్పోయాను. ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థ సహాకారంతో కృత్రిమకాళ్లు పెట్టించుకున్నాను. వాటితోనే నేత నేసేవాడిని. అయినప్పటికీ నొప్పి వస్తూనే ఉండేది. కానీ ఈ యంత్రం సహాయంతో ఎలాంటి కష్టం లేకుండా చాలా సులభంగా నేత నేస్తున్నాను. పైగా చాలా తక్కువ రోజుల్లోనే చీర నేస్తున్నాను. నాలాంటి దివ్యాంగులతో పాటు, మహిళలు, వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈయంత్రాన్ని కనిపెట్టిన శివకుమార్‌గారికి ధన్యవాదాలు.-రమేశ్, చేనేత కార్మికుడు
కష్టం లేకుండా చేస్తుంది..
ఈ యంత్రం వల్ల కార్మికులు శ్రమ తగ్గి ఉత్పత్తి పెరుగుతుందని, దివ్యాంగులు, వృద్ధులు మహిళలు చాలా సులభంగా ఈ యంత్రం సాయంతో చేనేత పని చేసుకోవచ్చని యంత్రాన్ని రూపొందించిన మోదా టెక్నాలజీస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ తెలిపారు.