Revanth Reddy Munugodu campaign: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతుగా సంస్థాన్ నారాయణ పురం మండలం గుడిమల్కాపూర్, కోతులపురం, అల్లందేవి చెరువు, సర్వేల్ గ్రామాల్లో ప్రచారం చేశారు. ఒకప్పుడు చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌లో ఉన్నాడని ఆయన తెదేపాలోకి కోడలి లాగా వచ్చాడని... తాను తెదేపా బిడ్డనని... అక్కడ నుంచి కాంగ్రెస్‌లోకి కోడలి లాగా వచ్చానని రేవంత్ రెడ్డి పేర్కొన్నాడు. పుట్టిల్లు అయిన తెలుగు దేశం నుంచి మెట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు తెలిపారు. చంద్రబాబునాయుడునే తనను కాంగ్రెస్‌లోకి పంపించాడని అర్థం వచ్చేట్లు వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది. కాంగ్రెస్ పార్టీలోకి కోడలు లాగా వచ్చిన తాను...ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గౌరవం నిలబెడతానని స్పష్టం చేశారు.
పేదల కోసం వందసార్లు జైలుకెళతా: తాను జైలులో తిన్నచిప్పకూడు సాక్షిగా...తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి తీరుతానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదల కోసం ఒక్కసారి కాదు వంద సార్లు జైలుకు వెళ్లడానికి సిద్దమని ప్రకటించారు. కాంగ్రెస్ ఆశావహులు పార్టీ మారతారని గోతికాడి నక్కల్లా బీజేపీ, తెరాసలు ఎదురు చూశాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.