Yadadri Patha Gutta Brahmotsavalu: యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. వేదమంత్రోచ్చారణల నడుమ, సన్నాయి మేళాల హోరులో.. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ముందుగా పవిత్ర జలంతో ఆలయ పరిసరాలను సంప్రోక్షణ చేసిన అనంతరం లక్ష్మీ సమేత నారసింహులకు రక్షాబంధనం గావించారు. అనంతరం వేదపండితుల పారాయణాల మధ్య, సన్నాయి వాయిద్యాల హోరులో పుణ్యాహవాచనం తంతును వైభవంగా నిర్వహించారు.
కనువిందుగా అలంకరణ
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా తెప్పించిన పూలతో.. స్వామి అమ్మవార్లను అర్చకులు అలంకరించారు. వజ్రవైఢూర్యాలు, ముత్యాల హారాలు, బంగారు ఆభరణాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.