Yadadri Mahakumbha Samprokshana: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పర్వంలో భాగంగా మూడో రోజు పూజా పంచకుండాత్మక మహాయాగం కార్యక్రమాలు.. అర్చకులు, ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఉదయం బాలాలయంలో యగశాలలో శాంతి పాఠం, ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, మూలమంత్ర, మూర్తి మంత్ర హవనములు నిర్వహించారు. స్వయంభు ప్రధానాలయంలో షోడశకలశాభిషేకం నిర్వహించారు. తదుపరి నిత్య లఘు పూర్ణాహుతి బాలాలయంలో నిర్వహించారు. ఆగమ శాస్త్రానుసారం ఆలయ అర్చకులు ఈ వేడుకలును నిర్వహించారు.
కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఈవో గీతా రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. స్వయంభు ప్రధానాలయంలో నిర్వహించిన షోడశకలశాభిషేకం ప్రత్యేకమైంది. బింబ అంతర్గతమైన సర్వరోగ నివారణకై షోడశ గుణానుభవంతో, షోడశ కలశాలతో శుద్ధోదకములతో పాటు, వనస్పతి దేవతలకు సంబంధించిన ఓషదులతో, గోమూత్రాది పంచామృతాలతో అభిమంత్రించి, కలశ అంతర్గతమైన ఆయా దేవతలను, మంత్రాలతో ఆవాహన గావించారు. బింబ సంప్రోక్షణతో ఈ పూజలు నిర్వహించారు.