paddy farmers problems: కల్లాల్లో ఎక్కడ చూసినా ధాన్యపురాశులే. వానకు తడుస్తున్నాయి. ఎండకు ఎండుతున్నాయి. దాదాపు నెలన్నర నుంచి రైతుల ఎదురుచూపులు. రాష్ట్రంలోని పలు జిల్లాల రైతుల గోస ఇది. అసలే దిగుబడి తగ్గి ఆవేదనలో ఉన్న రైతులపై టార్పాలిన్లు, తూర్పార యంత్రాల భారమే తడిసి మోపడు అవుతోంది. చాలా కొనుగోలు కేంద్రాల్లో అధికారులు టార్పాలిన్లు ఇవ్వకపోవటంతో ధాన్యం తడవకుండా రైతులే వాటిని అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ధాన్యంలో తాలు తొలగించేందుకు తూర్పార యంత్రాల (ప్యాడీ క్లీనింగ్ మిషన్స్)ను ప్రభుత్వమే సమకూర్చాలి. యంత్రాలు అందుబాటులో లేక, ఉన్నవీ పనిచేయక రైతులు అద్దెకు తెచ్చుకుంటున్నారు. అకాలవర్షాలు, అదనపు భారంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గత సీజనులో ఇదే సమయంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువే కొన్నట్లు పౌరసరఫరాలశాఖ రికార్డులు చెబుతున్నా ధాన్యపు రాశులు మాత్రం తరగటం లేదు. అధికారులు పట్టించుకోరు.. వ్యాపారులది ఇష్టారాజ్యం. వెరసి రైతులది దయనీయ పరిస్థితి. వ్యాపారి చెప్పిన ధరకు ఒప్పుకొంటే.. అడిగినంత తరుగు ఇస్తే మాత్రమే ధాన్యం కాంటా మీదకు చేరుతుంది. లేదంటే ఎక్కడి బస్తాలు అక్కడే. వర్షం కురిస్తే తడిసి మొలకలు రావటం పరిపాటి అయింది. పోచంపల్లి కొనుగోలు కేంద్రంలో 360 మంది రైతులు దాదాపు లక్ష బస్తాల ధాన్యం తెచ్చి అక్టోబరు 7 నుంచి ఎదురుచూస్తున్నారు. మూడుసార్లు అకాల వర్షాలతో అవస్థలు పడ్డారు. తడిసిన ప్రతిసారీ సరకును మరో ప్రాంతానికి మార్చటం, ఆరబెట్టటం అధికారుల కోసం ఎదురుచూడడం మామూలైపోయింది. అధికారులు, మిల్లర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. బేరాలు ఆడిన వారే తప్ప కొన్నది 20, 25 మంది ధాన్యమే. తరలింపునకు రవాణాదారులు బస్తాకు రూపాయన్నారు. ఇప్పుడు రూపాయిన్నర డిమాండు చేస్తున్నారు. 40 కిలోలకు 3, 4 కిలోలు తరుగు రూపంలో అదనంగా ఇస్తేనే కొంటామని మిల్లర్లు.. ఇలా రైతులను దోచుకునేందుకే చూస్తున్నారు. ఇది అన్యాయమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ భారమూ రైతుపైనే..
కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్లు (పట్టాలు) ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదే. కానీ ఆ భారాన్ని రైతుల నెత్తినే రుద్దారు. రోజుకు ఒక్కో పట్టాకు రూ. 20 చెల్లించాలి. ఒక్కో ధాన్యపు కుప్పకు కనీసం 8 నుంచి 10 పట్టాలు అవసరం. ఇన్ని రోజులుగా రైతులపై ఎంత భారం పడిందో అర్థంచేసుకోవచ్చు. ధాన్యంలో తాలు, తప్ప లేకుండా ఉండేందుకు వాటిని తూర్పారబట్టాలి. ఆ యంత్రాలను అందజేయాల్సిందీ అధికారులే. ఇక్కడా చేతులెత్తేశారు. పెద్ద యంత్రమైతే గంటకు రూ. ఆరొందలు, చిన్న యంత్రమైతే గంటకు రూ. రెండొందలు చొప్పున రైతులే చెల్లించాల్సి వస్తోంది. ఒక ఎకరా ధాన్యం తూర్పారబట్టటానికే రూ. వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి.
ప్రభుత్వ విత్తనాలు వేసినా కోతలేనా?
ప్రభుత్వం ఇచ్చిన విత్తులే వేశాం. ఇప్పుడేమో తేమ అంతుంది, ఇంతుంది అంటున్నారు. గత ఏడాది ఈ సమస్య రాలేదు. బస్తాకు మూడు, నాలుగు కిలోలు తరుగు తీస్తే మేమేం కావాలి? కుప్పలు పోసి రెండు నెలలైంది. పలుకుబడి ఉన్నోళ్లది తీసుకుంటున్నారు. మాలాంటి చిన్నోళ్లను పట్టించుకోవటం లేదు. వాళ్లకు లేని తరుగు మాకెందుకు వస్తోంది? - రాసాల మహేష్, యాదాద్రి జిల్లా తుక్కాపురం
ఓపిక నశించింది...