యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామానికి చెందిన కురిమేటి నవీన్ చిన్నవయసులనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఎన్నో కష్టాలను అధిగమించి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్ననాటి నుంచి నా అనే వారు లేక పడిన కష్టాలు... మరెవరికి రాకూడదనే ఉద్దేశంతో తనలాంటి అనాథలకు సాయం చేయాలనుకునేవాడు. మరో నలుగురు మిత్రుల(కురిమేటి నరేందర్, నల్ల నవీన్, సూరారం వంశీ, కురిమేటి గోవర్దన్)తో కలిసి మాతృదేవోభవ, పితృదేవోభవ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. అప్పటి నుంచి సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
హైదరాబాద్లో పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 100 మంది అనాథలకు నోటు పుస్తకాలు, పెన్స్, స్టడీమెటీరియల్ అందించింది ఈ బృందం. గాంధీ ఆసుపత్రిలోని రోగుల బంధువులకు, రోడ్డు పక్కన ఉండే అనాథ పిల్లలకు, మజ్జిగ ప్యాకెట్లు, ఆహార పొట్లాలు అందిస్తున్నారు.